- Home
- Entertainment
- ఆమె లేకుంటే ఇంద్ర, అత్తారింటికి దారేది సినిమాలే లేవు.. సుహాసిని నుంచి ఆర్తి అగర్వాల్ వరకు, అందరికీ ఆమె గొంతే
ఆమె లేకుంటే ఇంద్ర, అత్తారింటికి దారేది సినిమాలే లేవు.. సుహాసిని నుంచి ఆర్తి అగర్వాల్ వరకు, అందరికీ ఆమె గొంతే
సీనియర్ హీరోయిన్లు సుహాసిని, విజయశాంతి, రమ్య కృష్ణ నుంచి ఆర్తి అగర్వాల్ వరకు చాలా మంది స్టార్ హీరోయిన్లకు తన మ్యాజికల్ వాయిస్ అందించిన నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత
గొప్ప సినిమాలు వచ్చినప్పుడు అందులో నటించిన నటీనటులే ఎక్కువగా హైలైట్ అవుతారు. కానీ ఆ సినిమాల తెరవెనుక ఉన్న వారికి అంతగా గుర్తింపు లభించదు. అలా అద్భుతమైన ప్రతిభతో తెరవెనుకే ఎక్కువగా ఉండిపోయిన నటి ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. మరో చరిత్ర, ఇది కథ కాదు, కాంచన గంగ, కలియుగ పాండవులు లాంటి చిత్రాల్లో నటించిన నటి సరిత. ఆమె చివరగా తెలుగులో నటించిన మూవీ అర్జున్. మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సరిత విలన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ భార్యగా ఆండాళ్ పాత్రలో నటించింది ఈమెనే.
స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్
ఆమె నటిగా కంటే ఎక్కువగా తన ప్రతిభ చాటుకుంది డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే. 1979 నుంచి సరిత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. సీనియర్ నటి సుజాత నుంచి ఆర్తి అగర్వాల్ వరకు సరిత చాలా మంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. సుహాసిని, భానుప్రియ, విజయశాంతి, రాధా, నగ్మా, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా 90 దశకంలో అందరి హీరోయిన్లకు సరిత వాయిస్ అందించారు. ఇంద్ర మూవీ రిలీజయ్యే సమయానికి ఆర్తి అగర్వాల్ వయసు 18 ఏళ్ళు మాత్రమే.
ఇంద్ర మూవీలో ఆర్తి అగర్వాల్ కి డబ్బింగ్
అప్పటికి సరిత వయసు 42 ఏళ్ళు. అయినప్పటికీ ఆర్తి అగర్వాల్ కి సరిత అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు. ఇంటర్వెల్ సన్నివేశంలో ఆర్తి అగర్వాల్ డైలాగులు పవర్ ఫుల్ గా పేలాయి అంటే అది సరిత డబ్బింగ్ మహిమే అని చెప్పాలి. విజయశాంతికి కర్తవ్యం చిత్రంతో పాటు కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చిత్రాల్లో ఆమె డబ్బింగ్ చెప్పారు.
అత్తారింటికి దారేదిలో నదియాకి కూడా..
అంతే కాదు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రానికి పిల్లర్ లాంటి అత్త పాత్రలో నటించిన నదియాకి కూడా డబ్బింగ్ చెప్పింది సరితానే. దృశ్యం, అ ఆ చిత్రాల్లో కూడా నదియాకి సరిత తన వాయిస్ అందించారు. ఆమె అద్భుతమైన వాయిస్ లేకుండా ఆ చిత్రాలని ఊహించుకోలేం. అంతటి అద్భుతమైన వాయిస్ అందించింది సరితఅని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం అలీతో సరదాగా అనే కార్యక్రమంలో బయటపడింది.
అర్జున్ మూవీలో ఆ విధంగా అవకాశం
చాలా చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా కూడా నటించారు. మహేష్ బాబు అర్జున్ చిత్రంలో విలన్ గా నటించేందుకు సరిత ముందుగా అంగీకరించలేదట. తమిళంలో తాను జూలీ గణపతి అనే చిత్రంలో నటించాను. ఆ మూవీలో నాది నెగిటివ్ క్యారెక్టర్. ఆ పాత్ర చూసే మహేష్ బాబు, గుణశేఖర్ నన్ను ఎంపిక చేశారు. వాళ్ళే నన్ను అర్జున్ మూవీ కోసం కన్విన్స్ చేశారు అని సరిత తెలిపారు.