ప్రముఖ విలన్ విజయ రంగరాజు కన్నుమూత, విష్ణువర్థన్‌పై కామెంట్స్ తో సంచలనం
విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు విజయ రంగ రాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో విలన్ పాత్రల్లో నటించిన మెప్పించిన నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుపుకున్నాయి.
విజయ రంగరాజు గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఆయన ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. చికిత్స కోసం చెన్నై వెళ్లిన ఆయన అక్కడే కన్నుమూసినట్టు సమాచారం. విజయ్ రంగరాజుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయ రంగరాజు నటనలోకి రాకముందు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లోనూ పాల్గొన్నారు.
విజయ రంగరాజు అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. ఇండస్ట్రీలోకి వచ్చాక విజయ రంగరాజుగా పేరు మార్చుకున్నారు. ఆయన మద్రాసులోని రంగస్థల కళాకారుడిగా అనేక నాటకాల్లో నించారు. ఆ అనుభవంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో సినిమాలు చేసి మెప్పించారు. విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `వియత్నాం` అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన `సీతా కళ్యాణం` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు విజయరంగరాజు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించారు.
ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన `భైరవ ద్వీపం` చిత్రంతో ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. ఇందులో మాంత్రికుడిగా కనిపించి మెప్పించారు. క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు. అలాగే ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన `మగరాయుడు` సినిమాలో జిన్నా అనే విలన్ పాత్రతోనూ అందరిని ఆకర్షించారు. ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు. దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది.
అక్కడి నుంచి వచ్చి `ఉరి` సినిమాలో నటించారు. అది పేరుని తీసుకురాలేకపోయింది. ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన `యజ్ఞం` మూవీ సైతం విజయ రంగరాజుకి మరింత గుర్తింపుని తీసుకొచ్చింది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు. `విశాఖ ఎక్స్ ప్రెస్`, `ఢమరుకం`, `బ్యాండ్ బాజా`, `శ్లోకం` చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ రంగ రాజు.
విష్ణు వర్దన్ కు లేడీస్ వీక్నెస్, మొదట నుంచీ అదే పద్దతిలో ఉండేవాడని అన్నారు. విష్ణు వర్దన్ తో తాను `ముత్తైద భాగ్య` అనే కన్నడ సినిమాలో నటించానని.. తాను సెట్స్ల్ కి వెళ్లినపుడు జయమాలిని నేరుగా వచ్చి తనను ఆలింగనం చేసుకోవడాన్ని ఆయన ఓర్చుకోలేకపోయాడని, వెంటనే దర్శకుడిని పిలిచి తమ ఇద్దరినీ సెట్స్ నుంచి బయటికి పంపమని ఆదేశించాడని విజయ్ రంగరాజు అన్నాడు.
Vijaya Rangaraju
విష్ణు వర్దన్ కు ఉన్న లేడీస్ వీక్నెస్ తో తట్టుకోలేక తమను వెళ్లిపొమ్మన్నాడని అన్నారు. ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే.. తాను డిస్టర్బ్ అవుతున్నానని చెప్పాడని.. ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ్ రంగరాజు వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కన్నడ హీరోల ఫ్యాన్స్, విష్ణు వర్థన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ కావడంతో దిగొచ్చిన విజయ రంగరాజు బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు.