తెలుగు డైరెక్టర్ల సినిమాలకు తమిళ, హిందీ భాషల్లో జాతీయ అవార్డు
తాజగా ప్రకటించిన జాతీయ ఫిల్మ్ అవార్డులలో టాలీవుడ్ కు 7 అవార్డులు వచ్చాయి. అయితే తెలుగు డైరక్టర్లు తెరకెక్కించిన ఇతర భాష సినిమాలు కూడా నేషనల్ అవార్డుల్లో సత్తా చాటాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి?

నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమాలు
2023లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు గాను 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో తెలుగు సినిమాలు మొత్తం ఏడు విభాగాల్లో విజయాన్ని నమోదు చేయడంతో టాలీవుడ్ సత్తా మరోసారి రుజువయ్యింది. మూవీ లవర్స్ ఈ విషయంలో ఫుల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరోవైపు తెలుగు డైరెక్టర్లు రూపొందించిన సినిమాలకు తమిళ, హిందీ భాషల్లో నేషనల్ అవార్డు రావడం పెద్ద చర్చకు దారి తీసింది.
వెంకీ అట్లూరి సినిమాకు తమిళంలో అవార్డు
వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ సినిమా తమిళంలో వాతి పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా రెండు భాషలలో విడుదలైన బైలింగ్వల్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో తమిళ స్టార్ డైరక్టర్ ధనుష్, సంయుక్త మేనన్ హీరో,హీరోయిన్లుగా నటించారు. ఈసినిమాలో సంగీతం విభాగంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు జీవి ప్రకాష్ కుమార్ గెలుచుకున్నారు. అయితే ఇది తమిళ్ వెర్షన్ వాతి ఖాతాలో నమోదు కావడం గమనార్హం.
తెలుగు దర్శకుడి హిందీ సినిమాకు జాతీయ అవార్డ్
టాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సంచలన సినిమా యానిమల్. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈసినిమా కూడా నేషనల్ అవార్డుల్లో చోటు సంపాదించింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
యానిమల్ సినిమాకి గాను బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీధరన్‌లకు అవార్డు ప్రకటించబడింది. అదే సమయంలో, ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు బెస్ట్ బీజీఎమ్ విభాగంలో నేషనల్ అవార్డు లభించింది. ఆసక్తికర విషయం ఏంటంటే? హర్షవర్ధన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన సంగీత దర్శకుడే కావడం విశేషం.
ఇక తెలుగు దర్శకులు చేసిన సినిమాలకు గాను తమిళ్, హిందీ వెర్షన్ల పేరుతో అవార్డులు ప్రకటించబడటం విశేషం. ఈ నేపథ్యంలోనూ తెలుగు టాలెంట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం సినీ ఇండస్ట్రీకి గర్వకారణమనే చెప్పవచ్చు. 71వ నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమాలు, తెలుగు డైరెక్టర్లు చేసిన సినిమాలు ,సాధించిన విజయాలు తెలుగు పరిశ్రమ ప్రతిష్ఠను మరింతగా పెంచాయి.