కెఎస్ భరత్ వర్సెస్ ఇషాన్ కిషన్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఛాన్స్ ఎవరికి..?
WTC Finals 2023: త్వరలో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భారత జట్టు తరఫున ఆడబోయే వికెట్ కీపర్ ఎవరు..? అన్నదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది.

ఈనెల 7-11 మధ్య లండన్ లోని ‘ది ఓవల్’ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు ఇప్పటికే లండన్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయం కారణంగా తప్పుకున్న నేపథ్యంలో ఫైనల్ లో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయించాలన్నది ఇప్పుడు భారత జట్టు ముందున్న అతిపెద్ద సవాల్.
పంత్ కు గాయంతో భారత జట్టు కెఎల్ రాహుల్ తో పాటు కెఎస్ భరత్ ను కూడా వికెట్ కీపర్ గా ఎంపికచేసింది. కానీ ఐపీఎల్ లో గాయం కారణంగా రాహుల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సెలక్టర్లు ఇషాన్ కిషన్ ను కూడా వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలన్నది..? రోహిత్ సేనకు ఇరకాటంలో పెడుతున్నది.
అయితే దూకుడైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లో కూడా మెరుగ్గా ఉండటంతో భరత్ కంటే ఇషాన్ ను ఆడించడమే బెటర్ అని కొందరు.. ఓపెనర్లుగా రోహిత్ - గిల్ ఉండటం, మిడిలార్డర్ లో కూడా ఖాళీ లేకపోవడంతో పాటు లోయరార్డర్ లో జడ్డూ, అశ్విన్ లు బ్యాటింగ్ చేయగల సమర్థులున్నారని, ఈ క్రమంలో ఇషాన్ కిషన్ తో పెద్దగా ఉపయోగం లేదని మరికొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Image credit: PTI
ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘కెఎస్ భరత్ తో పోలిస్తే ఇషాన్ బెటర్ ఆప్షన్. రోహిత్ - గిల్ లో ఓపెనర్లుగా ఉన్నారు కావున లోయరార్డర్ లో దూకుడుగా, అటాకింగ్ గేమ్ ఆడే సామర్థ్యమున్న ఇషాన్ ఉంటేనే టీమిండియాకు ఉపయోగకరం..’అని చెప్పాడు.
కానీ టీమిండియా మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ మాత్రం పాంటింగ్ వ్యాఖ్యలకు భిన్నంగా వ్యాఖ్యానించాడు. ‘ఇషాన్ కంటే కెఎస్ భరత్ ను ఆడిస్తేనే బెటర్. భరత్.. ప్రాపర్ టెస్టు మ్యాచ్ లకు సరిపోయే వికెట్ కీపర్. ఇటీవల ఆస్ట్రేలియాతో కూడా మనం అది చూశాం. అతడికి అవకాశం దక్కాలి...
ఇషాన్ ఓపెనర్. అతడు టెస్టులకు సమర్థుడు కాదని నేను చెప్పడం లేదు. ఇషాన్ కూడా ఫ్యూచర్ లో టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ లో కీలక ఆటగాడు అవుతాడు. ఆరో నెంబర్ లో బ్యాటింగ్ భిన్నంగాఉంటుంది. దానికి ఓర్పు కావాలి. ఇషాన్ దూకుడుగా ఆడి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తాడు. అందులో సందేహమే లేదు. కానీ భరత్ కూడా అలాంటి షాట్స్ ఆటగలడు..’అని చెప్పాడు.