అంపైర్లైతే నార్మల్‌గా దానిని నాటౌట్ ఇచ్చేవారు : గిల్ క్యాచ్‌పై సంగక్కర కామెంట్స్
WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ గురించి తీవ్రమైన చర్చ సాగుతోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో కామెరూన్ గ్రీన్ పట్టుకున్నాడా..? లేదా..? అన్నదానిపై ఇప్పుడు క్రికెట్ వర్గాలలో చర్చ జోరుగా సాగుతోంది. టీవీ రిప్లైలో గ్రీన్ క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకిందని స్పష్టంగా కనిపించినా అంపైర్ మాత్రం దానిని ఔట్ గా ప్రకటించడం వివాదానికి దారితీసింది.
దీనిపై అభిమానులతో పాటు కామెంట్రీ బాక్స్ లో ఉన్న దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు అది నాటౌట్ అని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. తాజాగా వీరికి లంక మాజీ క్రికెటర్ ఇదే డబ్ల్యూటీసీ ఫైనల్ లో కామెంటేటర్ గా ఉన్న కుమార సంగక్కర కూడా జతకలిశాడు.
గిల్ నిష్క్రమణపై సంగక్కర స్పందిస్తూ.. ‘ఇది (క్యాచ్ ఔట్) మీరు చూసేదానిని బట్టి ఉంటుంది. ఒకవేళ బంతి లోని ఏ పార్ట్ అయినా నేలకు తాకుతున్నట్టు అనిపించినా నార్మల్ గా అంపైర్లు అయితే దానిని నాటౌట్ గా ప్రకటిస్తారు..’అని చెప్పాడు.
ఇక ఈ వివాదానికి కేంద్ర బింధువు అయిన గ్రీన్ క్యాచ్ ఔట్ఖ పై స్పందిస్తూ.. ‘నేను కరెక్ట్ గానే క్యాచ్ అందుకున్నట్టు భావించా. క్లియర్ క్యాచ్ అందుకుని బంతిని పైకి విసిరాను. ఇందులో అయితే నాకు ఎలాంటి అనుమానమూ లేదు. కానీ నిర్ణయం మాత్రం థర్డ్ అంపైర్ కు వెళ్లింది.
థర్డ్ అంపైర్ కెటిల్‌బోరో దానిని పలుమార్లు వివిధ యాంగిల్స్ లో పరిశీలించి అది సరైన క్యాచే అని అంగీకరిస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. స్లిప్స్ లో క్యాచ్ లు పట్టడం ఈజీ కాదు. అందుకు నేను చాలా శ్రమించా.. నన్ను నేను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందకు సాగాను..’అని చెప్పాడు.
కాగా నిన్న గిల్ వివాదాస్పద క్యాచ్ తర్వాత ఓవల్ లో ఇండియన్ ఫ్యాన్స్.. గ్రీన్ తో పాటు ఆస్ట్రేలియాను టార్గెట్ చేస్తూ ‘చీటర్స్ చీటర్స్’అని బిగ్గరగా అరిచారు. గ్రీన్ బౌలింగ్ కు వచ్చిన ప్రతీసారి ‘గలి గలి మే షోర్ హై కామెరూన్ గ్రీన్ చోర్ హై’అంటూ కామెంట్స్ చేశారు. తన ఔట్ పై శుభ్‌మన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించాడు. గ్రీన్ క్యాచ్ పడుతున్నప్పుడు బంతి స్పష్టంగా నేలకు తాకుతున్న ఫోటోను షేర్ చేశాడు. భూతద్దంతో పాటు నెత్తి కొట్టుకుంటున్న ఎమోజీని ఇందుకు క్యాప్షన్ గా పెట్టాడు.