అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా!... వేలంలో భారీ ధర దక్కించుకున్న 19 ఏళ్ల రిచా ఘోష్...
19 ఏళ్ల వయసులో కెరీర్ గురించి ఆలోచించేవాళ్లే చాలా తక్కువ. అయితే అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ రిచా ఘోష్, టీనేజ్ వయసులోనే స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుంది. షెఫాలీ వర్మతో కలిసి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఇద్దరూ అమ్మాయిలు అదిరిపోయే ధర దక్కించుకున్నారు...

అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షెఫాలీ వర్మను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వికెట్ కీపర్ రిచా ఘోష్‌ని రూ.1 కోటి 90 లక్షలకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు...
Image credit: Getty
‘మా అమ్మనాన్నలు నేను టీమిండియా తరుపున ఆడాలని కలలు కన్నారు. ఆ కల తీరిపోయింది. ఇప్పుడు నాకు టీమిండియాకి కెప్టెన్సీ చేసి, ఐసీసీ ట్రోఫీలు గెలవాలనే కోరిక ఉంది. కోల్‌కత్తాలో ఇల్లు కొనుక్కోవాలనేది నా ఆశ..
మా అమ్మనాన్నలు, ఆ ఇంట్లో ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నా. వాళ్లు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. నాకు క్రికెటర్‌గా కెరీర్ ఇవ్వడానికి ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పటికి నేను ఆడుతుంటే మా నాన్న అంపైరింగ్ చేస్తారు...
Richa Ghosh
ఈ వేలం తర్వాత వాళ్లకి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదనుకుంటా.. ఈ డబ్బుతో వాళ్ల కోసం మంచి ఇల్లు కొంటాను...’ అంటూ చెప్పుకొచ్చింది పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన రిచా ఘోష్...
‘రిచా నుంచి మేము ఏమీ ఆశించలేదు, ఇప్పటికీ ఆశించడం లేదు. ఆమెకి ఓ అద్భుతమైన కెరీర్ ఉంటే చాలు. స్టేట్ లెవెల్ ప్లేయర్ నుంచి ఇప్పుడు టీమిండియా ప్లేయర్‌గా మారింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చూసిన తర్వాత చాలామంది అమ్మాయిలు, క్రికెట్ ఆడడానికి ఆసక్తి చూపిస్తారని అనుకుంటున్నా. మా అమ్మాయి, అలా కొంతమంది అమ్మాయిలకు ఆదర్శంగా మారినా చాలు...’ అంటూ చెప్పుకొచ్చాడు రిచా ఘోష్ తండ్రి మనబేంద్ర..