- Home
- Sports
- Cricket
- TOP 5 Honest Cricketers : వరల్డ్ క్రికెట్లో టాప్ 5 జెంటిల్ మెన్ క్రికెటర్లు వీళ్లే.. ఎందుకో తెలుసా?
TOP 5 Honest Cricketers : వరల్డ్ క్రికెట్లో టాప్ 5 జెంటిల్ మెన్ క్రికెటర్లు వీళ్లే.. ఎందుకో తెలుసా?
Honest Cricketers: క్రికెట్ కేవలం బ్యాట్, బంతిలో కూడిన ఆట మాత్రమే కాదు… వ్యక్తిత్వం, నిజాయితీకి సంబంధించిన ఆట కూడా. వరల్డ్ క్రికెట్లో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.. కొందరు మాత్రం నిజాయితీపరులైన ఆటగాళ్లుగా గుర్తింపుపొందారు.

వరల్డ్ క్రికెట్లో టాప్ 5 హానెస్ట్ క్రికెటర్లు
అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకునే క్రికెటర్లు అనేకమంది. కొందరు బ్యాట్ తో పరుగుల వరద పారించి.. మరికొందరు బంతితో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు. కానీ అతితక్కువమంది క్రికెటర్లు మాత్రమే తమ వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటివారిలో క్రికెట్ గాడ్ గా పిలుచుకునే టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముందుంటారు. ఇలా సచిన్ లాగే మంచితనం, నిజాయితీని చాటుకున్న క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో చాలా అరుదు. అలాంటి ఓ ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. ఆడమ్ గిల్‌క్రిస్ట్
2003 ప్రపంచ కప్ సెమీఫైనల్ శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. హై-ప్రెజర్ మ్యాచ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ క్రీజులో ఉన్నాడు. బంతి బ్యాట్‌కు తగిలి చిన్న శబ్దం వచ్చింది… కానీ ఆ సౌండ్ అంపైర్ కు వినిపించనట్లుంది… అందుకే బౌలర్ అప్పీల్ చేసినా ఔట్ ఇవ్వలేదు. కానీ గిల్‌క్రిస్ట్ నిజాయితీగా పెవిలియన్‌కు తిరిగి వెళ్ళిపోయాడు. బంతి బ్యాట్‌కు తగిలిందని అతనికి తెలుసు… అందుకే నిజాయితీగా ఔట్ అయినట్లు ఒప్పుకున్నాడు. అతడి చేసినపని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
2. హషీమ్ ఆమ్లా
దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన, నిరాడంబరమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అతను మైదానంలో ఎప్పుడూ కోపం ప్రదర్శించడంగానీ, స్లెడ్జింగ్ చేయడంగానీ అభిమానులు చూడలేదు. బీర్ లేదా ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉన్న జెర్సీలను ఆమ్లా అస్సలు ధరించడు.. ఎందుకంటే అది తన మత విశ్వాసానికి విరుద్దమని నమ్ముతాడు. ఇలా ఆమ్లా తీరు సూత్రబద్ధమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
3. రాహుల్ ద్రవిడ్
క్రికెట్ ఒక పుస్తకం అయితే రాహుల్ ద్రవిడ్ అందులో అత్యంత నిజాయితీ గల పేజీ. ప్రపంచం అతన్ని 'ది వాల్' అని పిలుస్తుంది. అతను ఎప్పుడూ గొడవలు, వాదనలు, స్లెడ్జింగ్‌కు పాల్పడలేదు. క్రికెట్ అనేది ప్రవర్తనకు కూడా ఒక పరీక్ష అని ద్రవిడ్ నమ్మేవాడు. ఆ పరీక్షలో అతను ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచాడు.
4. ఏబీ డివిలియర్స్
ఏబీ డివిలియర్స్ పేరు వినగానే మిస్టర్ 360 గుర్తుకొస్తాడు. అతను ఆటలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ 360° ప్లేయర్. ఎప్పుడూ ఏ ఆటగాడితో గొడవపడలేదు, స్లెడ్జింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వలేదు. అతని మంచి వ్యక్తిత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతదేశంలో అతనికి చాలా ప్రజాదరణ ఉంది.
5. కుమార సంగక్కర
శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర పేరు వినగానే మంచితనం, నిజాయితీ గుర్తుకొస్తాయి. అతని మాటల్లో, ఆటలో లోతు ఉంటుంది. వికెట్ల వెనుక అతని స్వరం ప్రశాంతంగా, నిరాడంబరంగా ఉండేది. అతను ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు, ఆటగాళ్లతో గొడవ పడలేదు. బ్యాటర్లపై ఒత్తిడి తేవడానికి చెడు భాష వాడలేదు.

