అలాంటి ఆల్ రౌండర్ ప్రపంచ క్రికెట్ లో లేడు : జడ్డూపై పాక్ మాజీ స్పిన్నర్ ప్రశంసలు
Ravindra Jadeja: ఐదు నెలల విరామం తర్వాత తిరిగి జట్టలోకి వచ్చిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ మ్యాచ్ లో అదరగొట్టాడు. నాగ్‌పూర్ టెస్టులో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

గతేడాది ఆగస్టులో కాలికి గాయంతో క్రికెట్ కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా ఐదు నెలల తర్వాత ఇటీవలే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆడుతున్నాడు.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు ముందు ఒక రంజీ మ్యాచ్ ఆడిన జడ్డూ.. తొలి టెస్టులో సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో జడ్డూ.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్, అక్షర్ లు వికెట్లు తీయడానికి తంటాలు పడుతున్న చోట అతడు మెరిశాడు. స్మిత్, లబూషేన్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేసి ఆ జట్టును 177 పరుగులకే పరిమితం చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించి తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగుల ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా జడ్డూ.. లబూషేన్ తో పాటు మరో వికెట్ తీశాడు. ఈ ప్రదర్శనతో మ్యాచ్ లో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జడ్డూ సూపర్ షో తో అదరగొట్టడంతో అతడికి స్వదేశంతో పాటు దాయాది దేశం పాకిస్తాన్ లో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ డానిష్ కనేరియా జడ్డూపై ప్రశంసలు కురిపించాడు.
కనేరియా మాట్లాడుతూ... ‘రవీంద్ర జడేజా వంటి ఆల్ రౌండర్ ను ప్రపంచ క్రికెట్ చూడలేదు. అతడు అన్ని విభాగాలను డామినేట్ చేస్తాడు. అది బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఫీల్డింగ్ అయినా.. జడ్డూ మార్క్ ఉండాల్సిందే. ఒక కెప్టెన్ ప్రతీ మ్యాచ్ లో ఇలాంటి ఒక ప్లేయర్ ఉండాలనుకునే ఆటగాడు అతడు..
Image credit: PTI
ప్రత్యర్థిపై నిత్యం ఒత్తిడిని పెంచడంలో జడేజా సఫలమవుతాడు. గత ఐదారు నెలలుగా అతడు కావాల్సినంత క్రికెట్ ఆడలేదు. కానీ పునరాగమనంలో కూడా అతడు అదరగొడుతున్నాడు. తన ఫిట్నెస్, ఫిజిక్ మీద దృష్టి పెట్టే జడ్డూ.. రీఎంట్రీలో కూడా అదరగొట్టడం మామూలు విషయమైతే కాదు. అది కూడా ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద కావడం గమనార్హం...’అని చెప్పాడు.
కాగా ఈ మ్యాచ్ లో జడ్డూ మాయాజాలానికి కంగారూలు కంగారెత్తిన విషయం తెలిసిందే. ఆసీస్ బ్యాటర్లను తాను పడగొట్టిన పిచ్ మీదే జడ్డూ బ్యాటింగ్ లో 70 పరుగులు చేశాడు. ఓపికగా ఆడితే ఫలితాలు రాబట్టడం పెద్ద అసాధ్యమేమీ కాదని రోహిత్ తో పాటు జడ్డూ, అక్షర్ నిరూపించారు. కానీ ఈ ముగ్గురూ ఆడిన ఆటలో సగం కూడా ఆడకుండా కంగారూలు రెండో ఇన్నింగ్స్ లో ఒక్క సెషన్ కూడా ముగియకుండానే చేతులెత్తేశారు.