ఐపీఎల్‌లో తిప్పుతా.. టీమిండియాలో చేరుతా.. మిస్టరీ స్పిన్నర్ ఆశలు మాములుగా లేవుగా..
IPL 2023: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మళ్లీ టీమిండియాలోకి అడుగుపెడతానని అంటున్నాడు. రాబోయే ఐపీఎల్ లో అదరగొడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో ఫర్వాలేదనిపించిన కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 ప్రపంచకప్-2021 లో చోటు దక్కించుకున్నాడు. కానీ ఆ టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడిన వరుణ్.. పెద్దగా ప్రభావం చూపలేదు. మిస్టరీ స్పిన్నర్ అనే ట్యాగ్ లైన్ తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా అతడు ఆస్థాయి బౌలింగ్ ప్రదర్శించలేదు.
గతేడాది ప్రపంచకప్ లో భారత్.. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ల వంటి వాళ్లను కాదని మరీ వరుణ్ ను ఆడించింది. ప్రపంచకప్ లో మూడు మ్యాచ్ లు ఆడిన అతడు.. 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఆ టోర్నీలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతడి బౌలింగ్ చూశాక పలువురు పాక్ మాజీలు.. ‘ఇతడు మిస్టరీ స్పిన్నరా..? మా దేశంలో గల్లీ క్రికెట్ లో కూడా ఇంతకంటే బాగా బౌలింగ్ చేసేవాళ్లున్నారు..’ అని కామెంట్స్ చేశారు.
దీంతో ప్రపంచకప్ ముగిశాక సెలక్టర్లు మళ్లీ వరుణ్ ను పట్టించుకోలేదు. అయితే ఐపీఎల్ లో కేకేఆర్.. ఈ ఏడాది రిటెన్షన్ లో భాగంగా వరుణ్ ను రూ. 8 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ ఈ సీజన్ లో కూడా వరుణ్ విఫలమయ్యాడు. 11 మ్యాచ్ లు ఆడి ఆరు వికెట్లే తీశాడు.
వచ్చే సీజన్ లో కేకేఆర్ కూడా వరుణ్ ను తిరిగి దక్కించుకోవడం కష్టంగానే ఉంది. కానీ అతడు మాత్రం.. తాను వచ్చే ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తమిళనాడుకు చెందిన ఈ స్పిన్నర్ తాజాగా ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాబోయే సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నా కెరీర్ కు చాలా ముఖ్యం. ఆ ఈవెంట్ లో రాణించి మళ్లీ నేను జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటా. ఈ టోర్నీ కోసం నేను చాలా కష్టపడుతున్నా.
దీంతో పాటు రాబోయే ఐపీఎల్ సీజన్ కూడా మెరుగ్గా రాణించి తద్వారా తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకుంటా. ఈ రెండు టోర్నీలు నా కెరీర్ కు చాలా కీలకం కానున్నాయి. నేనిప్పుడు ఫిజికల్ గానే గాక మానసికంగా కూడా బలంగా ఉన్నా. నేను జాతీయ జట్టులోకి వస్తానన్న నమ్మకం నాకుంది..’ అని తెలిపాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు కేకేఆర్, పంజాబ్ కింగ్స్ తరఫున 42 మ్యాచ్ లు ఆడిన వరుణ్.. 42 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు తరఫున 6 మ్యాచ్ లు ఆడి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. గణాంకాలు, అతడి ప్రదర్శనను బట్టి చూస్తే వరుణ్ జాతీయ జట్టులోకి రావడం అతిశయోక్తే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.