- Home
- Sports
- Cricket
- INDW vs AUSW : ఆసిస్ తో టీమిండియా సెమీస్ పోరు... ఆటగాళ్లంతా నల్ల బ్యాడ్జీలు ఎందుకు ధరించారు?
INDW vs AUSW : ఆసిస్ తో టీమిండియా సెమీస్ పోరు... ఆటగాళ్లంతా నల్ల బ్యాడ్జీలు ఎందుకు ధరించారు?
Australia Women vs India Women : వరల్డ్ కప్ 2025 లో టీమిండియా మహిళా క్రికెటర్లు చేతికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని హాజరయ్యారు. ఆసిస్ టీం కూడా అలాగే మైదానంలో అడుగుపెట్టింది. ఇందుకు కారణమేంటో తెలుసా?

సెమీఫైనల్లో చేతికి నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన ఆటగాళ్లు
ICC Womens World Cup 2025 : స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కీలక మ్యాచ్ ఆడుతోంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది... ఈ మ్యాచ్ కు ముంబై స్టేడియం వేదికయ్యింది. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమయ్యింది... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఇరు జట్ల క్రీడాకారులు చేతికి నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. క్రికెట్ ఆడుతూ మైదానంలోనే ప్రమాదానికి గురయి మరణించిన ఓ యువ క్రీడాకారుడికి నివాళిగా ఇలా క్రికెటర్లంతా నల్ల బ్యాండ్లు ధరించారు.
ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ శివారులో ఓ యువ క్రికెటర్ శిక్షణ తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా వేగంగా దూసుకువచ్చిన ఓ బంతి అతడి మెడకు తగిలింది... దీంతో అక్కడే కుప్పకూలిపోయిన అతడు ప్రాణాలు వదిలాడు. ఇలా 17 ఏళ్ల ఆస్ట్రేలియన్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మైదానంలోనే మరణించాడు. అతడి మృతికి నివాళిగా ఇవాళ్టి సెమీ ఫైనల్లో ఆటగాళ్లంతా నల్లబ్యాడ్జీలు ధరించి ఆడుతున్నారు... ఇలా మ్యాచ్ చాలా భావోద్వేగంగా మొదలైంది.
ఆస్ట్రేలియా క్రికెట్‌ను కదిలించిన విషాదం
ఫెర్న్‌ట్రీ స్ట్రీట్ క్రికెట్ క్లబ్‌కు చెందిన యువ ఆల్-రౌండర్ బెన్ ఆస్టిన్ మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. ఒక T20 క్లబ్ గేమ్ కోసం సిద్ధమవుతుండగా బాల్ త్రోయింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతి అతని మెడకు తగిలింది.
అతను హెల్మెట్ ధరించినప్పటికీ పుర్రె కింది భాగంలో సున్నితమైన ప్రదేశాన్ని రక్షించే స్టెమ్ గార్డ్ లేదు. దీంతో వేగంగా దూసుకువచ్చిన బంతి అక్కడే తగలడంతో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తరలించారు.
వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికి పలితం లేకుండా పోయింది.. ఆస్టిన్ పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఇవాళ (గురువారం) ఉదయం మరణించాడు. ఇదే రోజు ఆస్ట్రేలియా, భారత్‌తో సెమీఫైనల్‌లో తలపడుతోంది. దీంతో ఆస్టిన్ కు నివాళిగా ఆసిస్ క్రికెటర్లతో పాటు భారత క్రికెటర్లు నల్ల బ్యాడ్జీ ధరించి క్రీడాస్పూర్తిని చాటారు.
“మేం పూర్తిగా కుంగిపోయాం”
బెన్ ఆస్టిన్ మరణాన్ని తండ్రి జేస్ ఆస్టిన్ ధృవీకరించారు. కొడుకు మరణంపై అతడు హృదయ విదారక ప్రకటన విడుదల చేశారు. ‘’గురువారం ఉదయం మా కొడుకు బెన్ మరణించాడు. ఈ వార్త మమ్మల్ని పూర్తిగా కుంగదీసింది. ఎంతో ఇష్టమైన క్రికెటే అతడిని మా నుంచి దూరం చేసింది. క్రికెటర్ గా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని అనుకున్న బెన్ ఇలా అదే ఆటలో మరణించడం విషాదకరం'' అంటూ కొడుకు మరణం గురించి జేస్ ఆస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా నివాళులు
యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ కు గౌరవ సూచకంగా క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి ఆడాలని నిర్ణయించాయి. జాతీయ గీతాల కోసం క్రీడాకారులు వరుసలో నిలబడినప్పుడు చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖ సమయాల్లో క్రికెట్ సమాజం ఎలా ఏకమవుతుందో ఇది తెలియజేసింది.
ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ బెన్‌ను “స్టార్ క్రికెటర్, గొప్ప నాయకుడు, అద్భుతమైన యువకుడు” అని అభివర్ణించింది. సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు సంతాప సందేశాలతో కూడిన పోస్ట్ లు పెడుతున్నారు. ఇతర దేశాల క్రీడాకారులు కూడా ఆసిస్ యువ క్రికెటర్ మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిలిప్ హ్యూస్ ఘటనను గుర్తుచేసిన ఆస్టిన్ మరణం
ఈ ఘటన 2014లో ఒక దేశీయ మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి మరణించిన ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణాన్ని గుర్తుచేసింది. క్రికెట్ విక్టోరియా చీఫ్ నిక్ కమ్మిన్స్ ఈ విషాదకరమైన ఘటనల మధ్య సారూప్యతను అంగీకరించారు. “10 ఏళ్ల క్రితం ఫిల్ హ్యూస్‌కు జరిగిన ప్రమాదం లాగే బంతి ఆస్టిన్ మెడకు తగిలింది అని కమ్మిన్స్ అన్నారు.
ఈ ఘటన క్రికెటర్ల భద్రత గురించి మరోసారి పునరాలోచించేలా చేస్తోందని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్ మైక్ బైర్డ్ అన్నారు. “స్పష్టంగా మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి'' అని ఆయన అన్నారు. “కానీ ప్రస్తుతం మేం ఆస్టిన్ కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నాం, వారికి అన్ని విధాలా మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం.” అని మైక్ బైర్డ్ తెలిపారు.