Matthew Potts: కేన్ మామకే చుక్కలు చూపిస్తున్నాడు.. ఎవరీ పాట్స్..?
Eng vs NZ: లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ టెస్టులో అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ అదరగొడుతున్నాడు. తన తొలి వికెట్ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ది.

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కు చుక్కలు చూపిస్తున్నాడు మాథ్యూ పాట్స్. ముఖ్యంగా ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ అయితే పాట్స్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాడు.
లార్డ్స్ టెస్టు లో రెండు ఇన్నింగ్స్ లలో కేన్ మామ ఔట్ అయింది ఈ కుర్రాడికే. తొలి ఇన్నింగ్స్ లో తాను వేసిన తొలి ఓవర్లోనే కేన్ ను ఔట్ చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో ఔట్ చేశాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి పాట్స్.. విలియమ్సన్ కు ఏడు బంతులు విసిరాడు. ఇందులో కేన్ మామ ఒక్క పరుగు కూడా చేయలేదు. కానీ రెండు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. ఇంతకీ ఎవరీ కుర్రాడు..?
నార్త్ ఇంగ్లాండ్ లోని సన్డర్లాండ్ లో 1998 లో జన్మించిన మాథ్యూ జేమ్స్ పాట్స్.. 2017 నుంచి వెలుగులోకి వచ్చాడు. ప్రముఖ కౌంటీ క్రికెట్ క్లబ్ డర్హమ్ తరఫున ఆడే ఈ కుర్రాడు.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇంగ్లాండ్ తరఫున అండర్-19 జట్టులో కూడా పాట్స్ ఆడాడు. అయితే 24 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పాట్స్.. 77 వికెట్లతో చెలరేగాడు. ఇప్పటివరకు అతడు ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచులలో అతడి ఎకానమీ 2.91 గా ఉండటం గమనార్హం.
డర్హమ్ తరఫున ఆడేప్పుడు నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. అండర్-19 జట్టుతో పాటు ఫస్ట్ క్లాస్ మ్యాచులలోనూ అతడి ప్రదర్శనలను చూసిన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని జాతీయ జట్టులోకి పిలిచింది. లార్డ్స్ టెస్టు లో ఈ కుర్రాడు అరంగేట్రం చేశాడు.
జట్టు అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతూ సీనియర్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తొలి ఇన్నింగ్స్ లో 9.2 ఓవర్లు బౌలింగ్ చేసిన పాట్స్.. 13 పరుగులే ఇచ్చాడు. అదీగాక నాలుగు మెయిడిన్లు వేసి.. ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.
కేన్ మామతో పాటు డారిల్ మిచెల్, వికెట్ కీపర్ టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్ లను ఔట్ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే కసితో బంతులు విసిరాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్నట్టే కనిపించిన కేన్ విలియమ్సన్ ను ఔట్ చేసిన పాట్స్.. ఆ తర్వాత లాథమ్ ను కూడా వెనక్కి పంపాడు. బౌలర్లకు సహకరిస్తున్న లార్డ్స్ పిచ్ పై మరిన్ని వికెట్లు తీయడం పక్కా అని అతడి ఫామ్ ను చూస్తేనే తెలుస్తున్నది.
కాగా.. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ భారత్ తో మిగిలిపోయిన ఐదో టెస్టును ఆడాల్సి ఉంది. మరి భారత్ కు కూడా పాట్స్ ఇవే ఇబ్బందులు సృష్టిస్తే మాత్రం మనం టెస్టు సిరీస్ మీద ఆశలు వదులుకోవాల్సిందే..!