ఐపీఎల్-16లో అత్యధికంగా సంపాదించే భారత క్రికెటర్ ఎవరో తెలుసా..?
IPL 2023: మరో ఆరు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మొదలుకానుంది. 2023వ సీజన్ కోసం ఇప్పటికే క్రికెటర్లు తమ ఫ్రాంచైజీల ట్రైనింగ్ క్యాంప్ లకు క్యూ కడుతున్నారు. మార్చి 31న గుజరాత్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది.

క్యాష్ రిచ్ లీగ్ గా పేరున్న ఐపీఎల్ లో ఈ ఏడాది ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్.. రూ. 18.5 కోట్లతో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడిగా ఉన్నాడు. ఈ లీగ్ లో ఇప్పటివరకూ ఇంత ధర దక్కించుకున్న ఆటగాడు కూడా కరనే కావడం గమనార్హం. ఈ సీజన్ లో కరన్.. పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
కరన్ తర్వాత ఈ జాబితాలో గతేడాది మినీ వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకున్న కామెరూన్ గ్రీన్ ఉన్నాడు. గ్రీన్ ను ముంబై.. రూ. 17.5 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో అతడిపై ముంబై భారీ ఆశలు పెట్టుకుంది. ఇన్నాళ్లు ఆ జట్టుకు సేవలందించిన పొలార్డ్ స్థానాన్ని గ్రీన్ భర్తీ చేస్తాడని ముంబై భావిస్తున్నది.
ఈ ఇద్దరి తర్వాత అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ ను సీఎస్కే.. రూ. 16.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ధోని రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో స్టోక్స్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చెన్నై కోరుకుంటున్నది.
అయితే అత్యధికంగా సంపాదిస్తున్న జాబితాలో భారత క్రికెటర్లు ఎవరైనా ఉన్నారా..? 15 సీజన్లు ఆడిన ధోనితో పాటు
సుదీర్ఘకాలంగా ఒకే సీజన్ కు ఆడుతున్న విరాట్ కోహ్లీ, తన ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ లు ఈ జాబితాలో లేరు. టెస్టులలో తన చెత్త ప్రదర్శనలతో నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కునే కెఎల్ రాహుల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
అవును. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడుతున్న భారత క్రికెటర్లలో హయ్యస్ట్ ఎర్నర్ గా ఉన్నది రాహులే. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న రాహుల్ ను గతేడాది ఆ జట్టు రూ. 17 కోట్లకు దక్కించుకుంది. ఈ ఏడాది అతడిని మళ్లీ రిటైన్ చేసుకుంది.
ఐపీఎల్ అత్యధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో కరన్ (రూ.18.5 కోట్లు), కామెరూన్ గ్రీన్ (రూ. 17.5 కోట్లు), కెఎల్ రాహుల్ (రూ. 17 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు ) ఉన్నారు. ఆ తర్వాత జాబితాలో రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ లు కూడా రూ. 16 కోట్లతో ఉన్నారు. ఇషాన్ కిషన్ కు రూ. 15 కోట్లు, కోహ్లీకీ రూ. 15 కోట్లు వస్తుండగా ధోనికి రూ. 12 కోట్లు దక్కుతున్నది.