- Home
- Sports
- Cricket
- అల్యూమినియం బ్యాటుతో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్.. యాషెస్ సిరీస్‌లో దుమారం రేపిన...
అల్యూమినియం బ్యాటుతో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్.. యాషెస్ సిరీస్‌లో దుమారం రేపిన...
క్రికెటర్లు వాడే బ్యాట్లకు బీభత్సమైన డిమాండ్ ఉంటుంది. అందుకే ప్లేయర్ల బ్యాటు మీద స్టిక్కర్లు అంటించడానికి కూడా కంపెనీలు కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి. బ్యాటు బరువు ఎంత ఉండాలి? సైజు ఎంత ఉండాలి అనే విషయంలో ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి..

2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, 50 ఓవర్లలో 359 పరుగుల భారీ స్కోరు చేసింది. రికీ పాంటింగ్ 140, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 57, మాథ్యూ హేడెన్ 37, డామియన్ మార్టిన్ 88 పరుగులు చేశారు.. ఇదే పిచ్‌పై టీమిండియా 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది..
ఆస్ట్రేలియా బ్యాటర్లు అంత ఈజీగా షాట్స్ కొడుతుండడం చూసి టీమిండియా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు, బ్యాటుల్లో స్పిన్‌లు పెట్టుకుని బ్యాటింగ్ చేశారని, అందుకే బంతి అంత వేగంగా బౌండరీకి వెళ్లిందనే ఓ పుకారు.. తెగ వైరల్ అయ్యింది.. అయితే అదంతా ఉట్టిదేనని తర్వాత తేలిపోయింది..
బ్యాటులో స్పిన్‌లు పెట్టుకోవడం సంగతేమో కానీ, ఓ టెస్టు మ్యాచ్‌లో ఓ ఆసీస్ బ్యాటర్ ఏకంగా అల్యూమినియం బ్యాటుతో బ్యాటింగ్ చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, 1979లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో జరిగిందీ సంఘటన..
Image credit: Getty
ఆస్ట్రేలియా బ్యాటర్ డెన్నిస్ లిల్లీ, 1979, డిసెంబర్ 15న యాషెస్ సిరీస్ మొదటి టెస్టు రెండో రోజున అల్యూమినియం బ్యాటుతో క్రీజులోకి వచ్చాడు. డెన్నిస్ లిల్లీ స్నేహితుడు గ్రాహం మోనగన్, ఓ బ్యాట్ల తయారీ సంస్థను పెట్టాడు. ఇందులో తయారుచేసిన అల్యూమినియం బ్యాటుకి మార్కెటింగ్ చేసేందుకు, ఆసీస్ బ్యాటర్ ఈ పని చేశాడు..
కోమ్‌బ్యాటుగా పిలిచే ఈ బ్యాటుతో షాట్ కొడితే, రీసౌండ్ మాత్రమే కాదు, వేగంగా బౌండరీకి దూసుకెళ్లింది. అంతే కాకుండా ఫీల్డర్‌కి పొరపాటున బ్యాటు తగిలితే ఎముకలు విరిగిపోవడం ఖాయం. అప్పటికే ఆస్ట్రేలియా 232 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సమయంలో డెన్నిస్ లిల్లీ, అల్యూమినియం బ్యాటుతో క్రీజులోకి వచ్చాడు.
అల్యూమినియం బ్యాటు వల్ల బాల్ పాడైపోతుండడాన్ని గమనించిన అంపైర్లు, బ్యాటు మార్చాల్సిందిగా లిల్లీకి చెప్పారు. అయితే అతను వినకపోవడంతో చాలాసేపు మ్యాచ్ ఆగిపోయి పెద్ద రచ్చే జరిగింది.
Dennis Lillee
దీంతో అప్పటి ఆసీస్ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్, గ్రౌండ్‌లోకి వెళ్లి చెక్క బ్యాటును ఇచ్చి... ‘మూసుకుని దీంతో బ్యాటింగ్ చేయమని’ లిల్లీకి చెప్పి వచ్చాడు. కెప్టెన్ ఆదేశాలతో తీవ్ర ఆవేశానికి లోనైన డెన్నిస్ లిల్లీ, తన అల్యూమినియం బ్యాటుని విసిరేసి, చెక్క బ్యాటుతో బ్యాటింగ్ చేశాడు..
అయితే ఈ సంఘటనతో ఒక్కసారిగా అల్యూమినియం బ్యాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొన్ని నెలల వరకూ కుర్రాళ్లు, ఈ బ్యాటు వాడేందుకు తెగ ఉత్సాహం చూపించేవాళ్లు. అయితే చెక్క బ్యాట్ల వాడకంపై ఐసీసీ రూల్ తీసుకురావడంతో అల్యూమినియం బ్యాట్లకు గిరాకీ పడిపోయింది..
నిజానికి ఈ మ్యాచ్‌కి 12 రోజుల ముందు బ్రిస్బేన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అల్యూమినియం బ్యాటు వాడాడు డెన్సిస్ లిల్లీ. అయితే ఆ మ్యాచ్‌లో లిల్లీ, ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో వెస్టిండీస్ ఈ బ్యాటు గురించి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.