ఓటమికి కారణాలు చెప్పకుండా కుంటిసాకులు చెబుతావా.. నువ్వేం కోచ్‌వి.. పాక్ హెడ్ కోచ్‌పై మాజీల ధ్వజం
పాకిస్తాన్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు గెలిచి 22 ఏండ్ల తర్వాత సిరీస్ గెలుచుకుంది ఇంగ్లాండ్. రావల్పిండి, ముల్తాన్ లలో విజయానికి దగ్గరగా వచ్చినా పాకిస్తాన్ విఫలమైంది. దీంతో ఆ జట్టుతో పాటు కోచింగ్ సిబ్బంది మీదా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంగ్లాండ్ తో రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ పై ఆ దేశ అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ మాట్లాడిన మాటలు అభిమానులతో పాటు మాజీలలోనూ ఆగ్రహాన్ని తెప్పించాయి. అసలు హెడ్ కోచ్ అయ్యుండి ఇలా ఎలా మాట్లాడతారని మాజీ ఆటగాళ్లకు సక్లయిన్ పై మండిపడుతున్నారు.
ముల్తాన్ టెస్టులో ఓడి సిరీస్ కోల్పోయిన తర్వాత సక్లయిన్ మాట్లాడుతూ.. ‘మేం రెండు టెస్టులు ఓడటం బాధాకరమే. కానీ కరాచీలో అయినా ఓదార్పు విజయం సాధిస్తామని భావిస్తున్నా..’ అని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ లో తీవ్ర చర్చ లేవనెత్తాయి.
సక్లయిన్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు, గతంలో చీఫ్ సెలక్టర్ గా పనిచేసిన మోహ్సిన్ ఖాన్ స్పందిస్తూ.. ‘ఏంటి..? ఓదార్పు విజయమా..? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్. హెడ్ కోచ్ గా ఉండి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే బాగుండేది. అలాంటిది ఓదార్పు విజయం గురించి మాట్లాడుతావా..? అసలు నువ్వు కోచ్ వేనా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ నుంచి ఇటువంటి సమాధానం ఊహించలేదు. వాళ్లు జట్టుకు మార్గదర్శకులుగా ఉన్నారు. వారే ఇలా మాట్లాడితే ఎలా..? నేనిప్పటికే చాలాసార్లు చెప్పాను. మహ్మద్ రిజ్వాన్ ను టెస్టులలో ఆడించొద్దని. నా మాట ఎవరూ వినరు.
రిజ్వాన్ పరిమిత ఓవర్లలో రాణించినంతగా సుదీర్ఘ ఫార్మాట్ లో సఫలం కాలేకపోతున్నాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా దృష్టి సారించాలి. నేను రిజ్వాన్ ను తప్పించండని చెప్పడం లేదు. రెస్ట్ ఇవ్వమని అడుగుతున్నా. అతడి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకోవాలి..’ అని తెలిపాడు.
కాగా రిజ్వాన్ బ్యాటింగ్ లో పదే పదే విఫలమవుతుండటంపై యూసుఫ్ మాట్లాడుతూ.. రిజ్వాన్ ను వెనకేసుకు రావడం విమర్శలకు తావిచ్చింది. అంతేగాక.. ‘ఈ ప్రశ్నలు నాకు సంబంధించినవి కావు’అని చెప్పాడు. ఇదే విషయమై అఫ్రిది స్పందించాడు.. ‘యూసుఫ్ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. అతడే నాకు సంబంధం లేదంటే ఎలా..? బ్యాటర్లు విఫలమైతే సమాధానం చెప్పేది ఎవరు..? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.