కుల్దీప్ దూకుడు.. హోప్, క్యాంప్‌బెల్ పోరాటంతో వెస్టిండీస్ కౌంటర్ అటాక్
India vs West Indies : ఫాలోఆన్ తర్వాత వెస్టిండీస్ కౌంటర్ అటాక్ కు దిగింది. జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్ హాఫ్ సెంచరీలో భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో కుల్దీప్ 5 వికెట్లు తీసుకున్నాడు.

భారత్‌పై వెస్టిండీస్ పోరాటం
ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. ఫాలోఆన్ ఆడుతూ వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (87* పరుగులు), షాయ్ హోప్ (66* పరుగులు) హాఫ్ సెంచరీలతో నాటౌట్‌గా నిలిచి తమ జట్టుకు విలువైన 138 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రస్తుతం భారత్ స్కోరును చేరడానికి వెస్టిండీస్ కు 97 పరుగులు అవసరం.
ఢిల్లీ టెస్టులో భారత్ ఆధిపత్యం
ఢిల్లీ టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 518/5 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు బాదారు. గిల్ నాయకత్వంలోని భారత బ్యాటర్లు సత్తా చాటారు.
ఆ తర్వాత, భారత బౌలర్లు కూడా అదరగొట్టడంతో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. కేవలం 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి విండీస్ ను దెబ్బకొట్టాడు. దీంతో భారత్ 270 పరుగుల భారీ ఆధిక్యం సాధించడంతో విండీస్ ఫాలోఆన్ కు దిగింది.
భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్న హోప్, క్యాంప్‌బెల్
ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ప్రారంభంలోనే 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తేజ్ నారాయణ్ చందర్ పాల్ (10) సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, అలిక్ అథనేజ్ (7) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరాడు.
వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన క్యాంప్‌బెల్, షాయ్ హోప్ విండీస్ ను కాపాడారు. ఇద్దరూ స్థిరంగా ఆడి, భారత బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. స్టంప్స్ సమయానికి ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి నాటౌట్ గా నిలిచారు. క్యాంప్‌బెల్ 9 బౌండరీలు, 2 సిక్స్‌లతో 87 పరుగులు చేయగా, షాయ్ హోప్ 8 బౌండరీలు, 2 సిక్స్‌లతో 66 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్ల వికెట్ల వేట
మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత బౌలర్లు విండిస్ రెండో ఇన్నింగ్స్ లో ప్రభావం చూపలేకపోయారు. మూడో రోజు చివరి సెషన్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. కుల్దీప్ యాదవ్, బుమ్రా, సుందర్, రవీంద్ర జడేజా.. అందరూ ప్రయత్నించినా వికెట్ దక్కలేదు. ఫాలోఆన్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు.
వికెట్ల కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ మార్పులతో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, మూడో రోజు క్యాంప్‌బెల్-హోప్ జోడీని విడదీయలేకపోయారు. దీంతో నాలుగో రోజు కూడా భారత్ బౌలింగ్ కొనసాగుతుంది.
ఐదు వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌ను కుల్దీప్ యాదవ్ కూల్చాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఐదోసారి 5 వికెట్లను సాధించాడు. కీలకమైన షాయ్ హోప్ (36), తేవిన్ ఇమ్లాక్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17) వికెట్లను తీశాడు.
హోప్, క్యాంప్‌బెల్ జంట ఎలా ఆడతారనేది మ్యాచ్ దిశను నిర్ణయిస్తుంది. నాలుగో రోజు భారత బౌలర్లు ప్రభావం చూపకపోతే ఫలితం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. భారత్ బౌలర్లకు ఇది సవాలు కానుంది. కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉండగా, హోప్-క్యాంప్‌బెల్ జోడీ భారత బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటోంది.