SA vs NAM : సౌతాఫ్రికాకు షాక్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో నమీబియా కొత్త చరిత్ర
Namibia vs South Africa: నమీబియా జట్టు చరిత్ర సృష్టించింది. విండ్హోక్‌లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 4 వికెట్ల తేడాతో ప్రోటీస్ జట్టును ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

SA vs NAM : నమీబియా చరిత్ర సృష్టించింది
శనివారం (అక్టోబర్ 11న) విండ్హోక్‌లో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో నమీబియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి కొత్త చరిత్రను సృష్టించింది. ఇది నమీబియా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలిచింది. కొన్ని రోజుల క్రితమే టీ20 ప్రపంచకప్ 2026కు అర్హత సాధించిన ఈ జట్టు ఇప్పుడు మరో అద్భుత విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించింది.
SA vs NAM : ఉత్కంఠభరితంగా సాగిన చివరి ఓవర్
135 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియా జట్టు ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులకే పరిమితమైంది. చివర్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్, బౌలింగ్ ఆల్‌రౌండర్ రూబెన్ ట్రంపెల్‌మన్ జట్టును గెలుపు దిశగా నడిపించారు.
చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన సమయంలో గ్రీన్ తనదైన బ్యాటింగ్‌తో విజయం అందించాడు. మొదటి బంతికి సిక్స్, చివరిని కూడా బౌండరీ కొట్టి జట్టుకు చారిత్రక విజయం అందించాడు. గ్రీన్ 23 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను దెబ్బకొట్టిన నమీబియా బౌలర్లు
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నమీబియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. దీంతో 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా కేవలం 134/8 పరుగులకే పరిమితమైంది. జేసన్ స్మిత్ 31 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్వింటన్ డి కాక్ అంతర్జాతీయ క్రికెట్‌కి తిరిగి వచ్చి కేవలం 1 పరుగుకే ఔట్ అయ్యాడు. నమీబియా తరఫున ట్రంపెల్‌మన్ మూడు వికెట్లు తీశాడు. మాక్స్ హేయింగో రెండు వికెట్లు సాధించాడు.
🚨 MATCH RESULT 🚨
An unfortunate result in Windhoek for #TheProteas Men, as Namibia took the game by 4 wickets. 🏏
A thrilling encounter where both sides showed tremendous fight in a fiercely contested battle. pic.twitter.com/Dwx6bpuseY— Proteas Men (@ProteasMenCSA) October 11, 2025
కొత్త స్టేడియంలో కొత్త చరిత్ర
ఈ మ్యాచ్ నమీబియా క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన కొత్త స్టేడియం “నమీబియా క్రికెట్ గ్రౌండ్ (NCG)”లో జరిగింది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ మైదానంలో సుమారు 7,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. వారు నమీబియా క్రికెట్ చరిత్రలో అత్యంత గర్వకరమైన విజయానికి సాక్షులయ్యారు. దక్షిణాఫ్రికాపై ఇది నమీబియా తొలి విజయమేకాకుండా, ఈ ఫార్మాట్‌లో ఆ జట్టుపై సాధించిన మొదటి చారిత్రక విజయం.
నాలుగో ఫుల్ మెంబర్ దేశాన్ని ఓడించిన నమీబియా
ఈ విజయంతో నమీబియా ఇప్పటివరకు నాలుగు ఫుల్ మెంబర్ దేశాలను టీ20ల్లో ఓడించింది. వాటిలో ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంకలతో పాటు ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా చేరింది. దక్షిణాఫ్రికా మొదటిసారిగా అసోసియేట్ జట్టుతో ఓడిపోయింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (21), మాలన్ క్రూగర్ (18), జెజె స్మిట్ (13) అవసరమైన సమయంలో పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
దక్షిణాఫ్రికా తరఫున నాండ్రే బర్గర్, ఆండీల్ సిమెలేన్ తలా రెండు వికెట్లు తీశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే నమీబియా ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విజయంతో నమీబియా ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చూపించిందని చెప్పొచ్చు.
దక్షిణాఫ్రికా 134/8 (20 ఓవర్లు)
నమీబియా 135/6 (20 ఓవర్లు)
నమీబియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రూబెన్ ట్రంపెల్మాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.