- Home
- Sports
- Cricket
- ఆడకున్నా ఆడిస్తాం.. రాహుల్‌కే తమ మద్దతు అన్న హెడ్‌కోచ్.. అంటే మూడో టెస్టులోనూ ఆ గండం తప్పదా..!
ఆడకున్నా ఆడిస్తాం.. రాహుల్‌కే తమ మద్దతు అన్న హెడ్‌కోచ్.. అంటే మూడో టెస్టులోనూ ఆ గండం తప్పదా..!
టీమిండియా స్టార్ ఓపెనర్, టెస్టులలో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ పై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని తొలగించాలని, మూడో టెస్టులో ఇతర ఆటగాళ్లకు అవకాశమివ్వాలని ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లూ డిమాండ్ చేస్తున్నారు.

టెస్టు కెరీర్ లో అత్యంత చెత్త ఫామ్ తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ ఆటపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణాన అతడిని మిగిలిన రెండు టెస్టులకూ జట్టు నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
పదే పదే విఫలమవుతుండటంతో అతడిని ఆడించొద్దని, తుది జట్టులో అతడిని చేర్చడం అంటే అది భారత్ లో బ్యాటర్లు లేరని ఒప్పుకోవడమే అంటూ టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్న వెంకటేశ్ ప్రసాద్.. అతడిని ప్రతీసారి ఆడిస్తున్నందుకు టీమ్ మేనేజ్మెంట్ పైనా విమర్శలు గుప్పించాడు.
ఇక రెండో టెస్టు ముగిశాక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. వరుసగా విఫలమవుతున్న రాహుల్ ను మళ్లీ ఆడిస్తారా..? మూడో టెస్టులో కూడా అతడు ఆడతాడా..? అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ద్రావిడ్ సమాధానమిస్తూ.. తాము కెఎల్ రాహుల్ సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. అతడికి టీమ్ మేనేజ్మెంట్ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని చెప్పాడు.
ద్రావిడ్ స్పందిస్తూ... ‘మేం కెఎల్ రాహుల్ ను పూర్తిగా నమ్ముతున్నాం. కెరీర్ లో అందరికీ ఇలా (ఫామ్ కోల్పోవడం) జరిగేదే. మేం అతడికి మద్దతుగా నిలుస్తాం. రాహుల్ బ్యాటింగ్ గురించి బయట విపరీతమైన చర్చ నడుస్తోంది. కానీ మా వరకు మాత్రం కెఎల్ సామర్థ్యమేంటో తెలుసు. ఒక్క రాహులే కాదు. ఇలాంటి ప్రశ్నే నాకు గతంలో కూడా చాలా మంది ప్లేయర్లు సరిగా ఆడనప్పుడు ఎదురైంది.
ఒక సమర్థవంతమైన ఆటగాడికి కష్టకాలంలో మద్దతుగా నిలవడం ఎంతో అవసరం. మీరు కెఎల్ గతంలో చేసిన హండ్రెడ్ లను చూడండి. అతడు ఎంత గొప్ప ప్లేయర్ అనేది మీకే తెలుస్తుంది. లార్డ్స్ టెస్టులో బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ పై సెంచరీ చేశాడు. సెంచూరియన్ లో కూడా సెంచరీ ఇలా వచ్చిందే. ఈ రెండు టెస్టులలో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. అది అతడి సామర్థ్యం..’అని చెప్పాడు.
కాగా కెఎల్ గురించి ద్రావిడ్ చెప్పిన మాటలను చూస్తుంటే మూడో టెస్టులో కూడా అతడు ఆడటం ఖాయమే అనిపిస్తున్నది. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లతో పాటు దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరగాల్సి ఉంది. ద్రావిడ్ మద్దతు ఇలాగే కొనసాగితే భారత క్రికెట్ అభిమానులకు మరోసారి రాహుల్ వైఫల్యాలను చూడటం తప్పదు.