ఇంత స్కోరు చేస్తామని మేము ఊహించలేదు.. అంతా వాళ్ల వల్లే : రోహిత్ శర్మ
WI vs IND: వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో పది ఓవర్లకు భారత స్కోరు 90 పరుగులు. అప్పటికీ రోహిత్ శర్మ క్రీజులోనే ఉన్నా.. మిగిలిన ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు. కానీ చివర్లో..

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. శుక్రవారం ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ముగిసిన మొదటి టీ20లో భారత్ 68 పరుగుల తేడాతో విండీస్ ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అయితే పది ఓవర్ల పాటు భారత బ్యాటింగ్ చూసి.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన క్రమంలో టీమిండియా ఇంత భారీ స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
Image credit: Getty
టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘ఆట తొలి పది ఓవర్ల తర్వాత చూస్తే ఇక్కడ భారీ స్కోరు చేయడం కష్టమనే అనిపించింది. ఈ పిచ్ మీద షాట్లు ఆడటం అంత సులభం కాదు. కానీ మేం ఇన్నింగ్స్ ను ముగించిన విధానం అద్భుతం.
పది ఓవర్ల తర్వాత మేమింత భారీ స్కోరు చేస్తామని నేనైతే ఊహించలేదు. మా ఆటగాళ్లు భాగా ఆడారు. ఈ మ్యాచ్ లో మేం గెలిచినా కొన్ని విషయాల మీద దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో మేమింకా మెరుగుపడాల్సి ఉంది..’ అని అన్నాడు.
Image credit: PTI
వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో పది ఓవర్లకు భారత స్కోరు 90 పరుగులు. అప్పటికీ రోహిత్ శర్మ క్రీజులోనే ఉన్నా.. రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లు పెవిలియన్ చేరారు. ఇక 15వ ఓవర్లో హిట్ మ్యాన్ కూడా ఔటయ్యాడు. కానీ దినేశ్ కార్తీక్, అశ్విన్ లు మాత్రం వీరవిహారం చేసి భారత్ కు భారీ స్కోరందించారు.
19 బంతులే ఆడిన డీకే.. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్, అశ్విన్ 13 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరుకు బాటలుపడ్డాయి. చివరి నాలుగు ఓవర్లలో ఈ ఇద్దరూ 52 పరుగులు జోడించి అసలు 160 చేస్తేనే గొప్ప అన్న స్కోరుబోర్డును 190కి చేర్చారు. భారీ లక్ష్య ఛేదనలో విండీస్.. 20 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేసింది.