అమ్మో.. ఓవల్‌లో కూడా భారత్‌లో ఉన్నట్టే ఉంటే మాకు తిప్పలే : ఆసీస్ వైస్ కెప్టెన్
WTC Finals 2023: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 7 నుంచి లండన్ లోని ది ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది.

ఆస్ట్రేలియా మాజీ సారథి, ప్రస్తుతం ఆ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న స్టీవ్ స్మిత్ త్వరలో జరుగబోయే ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో భాగంగా ఓవల్ పిచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓవల్ లో కూడా పిచ్ బ్యాటింగ్, స్పిన్నర్లకు అనుకూలిస్తే అప్పుడు తమకు తిప్పలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశాడు.
Image credit: PTI
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆసీస్ జట్టు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ లో పర్యటించింది. నాగ్‌పూర్, ఢిల్లీ లలో భారత్ గెలవగా ఇండోర్ టెస్టును ఆసీస్ గెలుచుకుంది. అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ వశమైంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కూడా పిచ్.. బ్యాటింగ్, స్పిన్ కు అనుకూలిస్తుందేమోనని స్మిత్ భయపడుతున్నాడు.
ఇదే విషయమై అతడు మాట్లాడుతూ... ‘ఓవల్ లోని పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని నేను భావిస్తున్నా. ఓవల్ పిచ్ వాస్తవానికి యూకేలో బౌలింగ్, బ్యాటింగ్ కు అనుకూలించే బెస్ట్ కండిషన్ పిచ్. కానీ ఈసారి పిచ్ మాత్రం భిన్నంగా ఉండనుందని అంటున్నారు.
ఒకవేళ ఓవల్ పిచ్ కూడా భారత్ లో మాదిరిగా ఉంటుందేమోనన్న భయంగా ఉంది. భారత్ కు ఇద్దరు ఫ్రంట్ లైన్ స్పిన్నర్లున్నారు. ఆ ఇద్దరినీ ఎలా ఎదుర్కోవాలనేదానిపై మేం ఇటీవలే ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ద్వారా ఓ అంచనాకు వచ్చాం. దాని ప్రకారమే మేం వారిని ఎదుర్కుంటాం..’ అని చెప్పాడు.
ఓవల్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే మాత్రం మా జట్టు తరఫున కూడా భారత్ తో టెస్టు సిరీస్ లో రాణించిన టాడ్ మర్ఫీ కీలకంగా మారుతాడని స్మిత్ అన్నాడు. ఇటీవల మర్ఫీ భారత్ లో స్పిన్ పిచ్ లను సద్వినియోగం చేసుకున్న విషయం విదితమే. జడేజా, అశ్విన్ లతో పోటీపడి మరి మర్ఫీ.. వికెట్లు పడగొట్టాడు.
ఇక ఐసీసీ రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్ణయంపై స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ఇది గొప్ప ఆలోచన అని.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో గెలిచి ట్రోఫీ అందుకోవాలనే కాంక్షతో అన్ని జట్లూ టెస్టు క్రికెట్ ను కూడా మెరుగ్గా ఆడతాయని అన్నాడు. ఎంత టెస్టు క్రికెట్ అయినా పోటీ ఉంటేనే మజా ఉంటుందని.. రెండేండ్ల పాటు శ్రమించి.. ఫైనల్స్ వరకూ రావడం.. తుదిపోరులో నెగ్గి ట్రోఫీ దక్కించుకోవడం మంచి కిక్ ఇస్తాయని స్మిత్ తెలిపాడు.