- Home
- Sports
- Cricket
- లంక ప్రజలు అలిసిపోయారు.. మేము ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాం : ఆస్ట్రేలియా సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
లంక ప్రజలు అలిసిపోయారు.. మేము ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాం : ఆస్ట్రేలియా సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
Sri Lanka Crisis: గడిచిన రెండు మూడు నెలలుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలు తమ హక్కుల సాధన కోసం నిత్యం రోడ్డు మీదకు రాని తప్పని పరిస్థితి. అయితే తాము వాళ్లకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్.

ఆకాశాన్నంటుతున్న ధరలు, నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల రేట్లతో దినదినగండంలా బతుకులీడుస్తున్నారు శ్రీలంక ప్రజలు. కరెంట్ కోతలతో అల్లాడుతున్న ద్వీప దేశానికి తాము ఉల్లాసాన్ని ఇస్తామంటున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.
ఈ నెల 7 నుంచి శ్రీలంకలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 లు ఆడాల్సి ఉంది. ఆరు వారాల షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే కంగారూలు.. లంకలో కాలుమోపారు.
అయితే దేశం సంక్షోభం ఎదుర్కుంటున్న ఈ పరిస్థితుల్లో లంక పర్యటన పై మీ స్పందన ఏమిటని ఫించ్ ను స్థానిక విలేకరులు అడగగా ఫించ్ స్పందించాడు.
అతడు మాట్లాడుతూ.. ‘మేమిక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం. తీవ్ర ఒత్తిడిలో ఉన్న లంక ప్రజలకు మేము కొంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాం. 2016 తర్వాత మేము శ్రీలంక పర్యటనకు రాలేదు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది.
ఈ టూర్ చాలా ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆట మీద వాళ్లు చూపించే అభిమానం, మాపై చూపించే ప్రేమ మమ్మల్ని కట్టిపడేశాయి..’ అని తెలిపాడు.
ఈ పర్యటనలో భాగంగా జూన్ 7 నుంచి 11 వరకు కొలంబో లోని ప్రేమాస స్టేడియంలో మూడు టీ20 లు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 14, 16, 19, 21, 24వ తేదీలలో ఐదు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇక జూన్ 29 నుంచి జులై 3 వరకు తొలి టెస్టు, జులై 8 నుంచి 12 వరకు రెండో టెస్టు జరుగుతాయి. రెండు టెస్టులూ గాలెలోనే నిర్వహించనున్నారు.