- Home
- Sports
- Cricket
- వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్.. సూర్యకు వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కదన్న మాజీ క్రికెటర్
వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్.. సూర్యకు వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కదన్న మాజీ క్రికెటర్
INDvsAUS Live: టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో మాత్రం ఆ మార్కు చూపించలేకపోతున్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్, పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో మాత్రం ఆ మార్కును చూపించలేకపోతున్నాడు. టీ20లలో రాణించడంతో అతడికి వన్డే జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా ఈ ఫార్మాట్ లో అతడి ఆట మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సూర్య.. నాగ్‌పూర్ టెస్టులో విఫలమయ్యాడు. తాజాగా అదే ఆసీస్ తో వన్డే సిరీస్ లోనే దారుణ ప్రదర్శనలతో విమర్శల పాలవుతున్నాడు.
వాంఖడే వేదికగా ముగిసిన తొలి వన్డేతో పాటు తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో కూడా సూర్య డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్.. సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య ఇదే ఆట ఆడితే అతడు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని చెప్పాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో జాఫర్ మాట్లాడుతూ.. ‘అవును. వన్డే వరల్డ్ కప్ టీమ్ లో సూర్య చోటు దక్కించుకోవడం కష్టమే. అసలే భారత్ కు ఈ వన్డే సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ లో మ్యాచ్ లు లేవు. ఈ సిరీస్ లో ఇప్పటికే వాంఖడేలో సూర్య విఫలమయ్యాడు. రాబోయే రెండు వన్డేలలో (విశాఖ వన్డేకు ముందుగానే జాఫర్ ఈ కామెంట్స్ చేశాడు) కూడా సూర్య విఫలమైతే అతడు వన్డే వరల్డ్ కప్ టీమ్ లో ఉండటం అనుమానమే...’అని చెప్పాడు.
కాగా తొలి వన్డేలో ఆసీస్ గెలిచే అవకాశాలున్నా ఆ జట్టు కీలక బౌలర్ స్టార్క్ కు సహకారం అందించే బౌలర్లు లేక కంగారూలు ఓడిపోయారని జాఫర్ అన్నాడు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని అందుకే పరుగుల రాక గగనమైందని చెప్పాడు. బంతి స్వింగ్ అవడంతో లెఫ్టార్మ్ పేసర్ అయిన స్టార్క్ కు వికెట్లు దక్కాయని, అతడికి మరెవరైనా సహకారం అందించుంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని తెలిపాడు.
కాగా వాంఖడే వన్డేలో 189 పరుగుల ఛేదనలో 39కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఆదుకున్నారు. రాహుల్ 75 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.