- Home
- Sports
- Cricket
- Virat Kohli: జీవితంలో మళ్లీ కెప్టెన్ కాలేడు.. కోహ్లిపై ఆర్సీబీ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
Virat Kohli: జీవితంలో మళ్లీ కెప్టెన్ కాలేడు.. కోహ్లిపై ఆర్సీబీ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
Virat Kohli - RCB: విజయాలు, అపజయాలు, ట్రోఫీల సంగతి ఎలా ఉన్నా భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ లలో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లి ఇటీవలే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకు సారథ్య బాధ్యతల నుంచి విముక్తి పొందాడు.

జాతీయ జట్టు సారథ్య బాధ్యతల గురించి కాసేపు పక్కనబెడితే ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లి.. ఆ జట్టును తొమ్మిదేండ్ల పాటు నడిపించాడు.
2013 నుంచి 2021 సీజన్ దాకా ఐపీఎల్ లో ఆర్సీబీకి సారథ్యం వహించిన కోహ్లి.. ఇంతవరకు ట్రోఫీని మాత్రం నెగ్గలేదనే అపప్రదను మూటగట్టుకున్నాడు. దీంతో గతేడాది సీజన్ లో దుబాయ్ లో జరిగిన రెండో దశకు ముందు తాను ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
దీంతో ఈ సీజన్ నుంచి ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అవసరం పడ్డాడు. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రిటైన్ చేసుకున్న గ్లెన్ మ్యాక్స్వెల్, వేలంలో దక్కించుకున్న ఫాఫ్ డుప్లెసిస్ లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ సారథి, న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డేనియల్ వెటోరి కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లి మళ్లీ ఆర్సీబీకి కెప్టెన్ గా చేయలేడు. అది పెద్దగా వర్కవుట్ అవ్వదు కూడా.. ఫ్రాంచైజీ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా ఒక జట్టు సారథి తాను సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని భావించినప్పుడు అతడిని వెళ్లనివ్వడమే ఉత్తమం. మళ్లీ వాళ్లకు కెప్టెన్సీని ఇచ్చి అనవసర బాధ్యతలను వాళ్లపై మోపడం కరెక్ట్ కాదు..’ అని వెటోరి చెప్పాడు.
తొమ్మిదేండ్ల పాటు ఆర్సీబీని నడిపించిన కోహ్లి...2015, 2020, 2021 లో ఆ జట్టును ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లగలిగాడు. 2016లో ఫైనల్స్ కూడా ఆడాడు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
ఇక ఆర్సీబీ కొత్త సారథి ఎంపిక గురించి మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి వాళ్లు (ఆర్సీబీ) కోహ్లి తో పాటు మ్యాక్స్వెల్, డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ లను ఛాయిస్ గా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.
మ్యాక్స్వెల్ కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో డుప్లెసిస్ ను సారథిగా చేసే అవకాశం ఉంది. డుప్లెసిస్ కు కూడా కోహ్లి వలే అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం ఉంది. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే ఆలోచిస్తున్నట్టున్నది.
ఒకవేళ మ్యాక్స్వెల్ గైర్హాజరీలో ఆర్సీబీ తొలి మూడు మ్యాచులను గెలిస్తే మాత్రం వాళ్లు డుప్లెసిస్ ను కొనసాగించొచ్చు..’అని వెటోరి అన్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని వెటోరి ఆశాభావం వ్యక్తం చేశాడు.