- Home
- Sports
- Cricket
- Sourav Ganguly: ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీయే అతడిని కావాలనుకున్నాడు.. బీసీసీఐ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sourav Ganguly: ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీయే అతడిని కావాలనుకున్నాడు.. బీసీసీఐ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat kohli: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చాలా కాలం గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం భారత జట్టు కెప్టెనే అని బీసీసీఐ చీఫ్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవలే మళ్లీ పొట్టి ఫార్మాట్ లోకి వచ్చిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మాయ చేస్తున్నాడు. టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కూడా అశ్విన్ బాగా రాణిస్తున్నాడు. అయితే ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అతడిని ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టులో అప్పటికే ఫామ్ లో ఉన్న యుజ్వేంద్ర చాహల్ ను కాదని, అశ్విన్ ను ఎంపిక చేయడంపై కూడా అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అదీగాక అప్పటికే టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి అశ్విన్ కు అభిప్రాయభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అశ్విన్ ను మళ్లీ టీమిండియా టీ20 ఫార్మాట్ లో చూస్తానని తానైతే అనుకోలేదని, దీనికి కారణం విరాట్ కోహ్లీనే అని చెప్పుకొచ్చాడు. అశ్విన్ జట్టులో ఉండాలని విరాట్ కోహ్లీనే కోరుకున్నానని తెలిపాడు.
ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. ‘అశ్విన్ మళ్లీ టీ20 జట్టులో ఉంటాడని నేనైతే అనుకోలేదు. కానీ టీ20 ప్రపంచకప్ లో అశ్విన్ జట్టులో ఉండాలని విరాట్ కోరుకున్నాడు. అందుకే అతడికి అవకాశం దక్కింది.
అయితే సుమారు నాలుగేండ్ల తర్వాత తనకు దక్కిన అవకాశాన్ని అశ్విన్ చక్కగా వినియోగించుకున్నాడు. అతడిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చక్కగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అందరూ అతడి గురించే మాట్లాడుతున్నారు.
కాన్పూర్ టెస్టు మ్యాచ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అశ్విన్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ అని ప్రశంసించాడు. కాన్పూర్ టెస్టుతో పాటు ముంబై టెస్టులో కూడా అశ్విన్ బాగా రాణించాడు. ఆ సిరీస్ లో అతడు లీడ్ బౌలర్ గా కూడా ఉన్నాడు.
ఇక అశ్విన్ ప్రతిభను గుర్తించడానికి రాకెట్ సైన్స్ ను వెతకాల్సిన పన్లేదు. అతడి రికార్డులే అశ్విన్ ఎంత ప్రతిభావంతుడో చెబుతాయి. 2011 లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుతో పాటు 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ లో కూడా అశ్విన్ సభ్యుడు. ఆ టోర్నీలలో అతడు భాగా రాణించాడు కూడా.
గతంలో సీఎస్కే గెలిచిన ట్రోఫీలలో కూడా అశ్విన్ పాత్ర ఎంత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ జట్టుకు అతడు ప్రధాన బౌలర్ గా ఉండేవాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడంలో అతడు దిట్ట. అతడి ఆటగాడిని మనం నిర్లక్ష్యం చేయకూడదు...’ అని గంగూలీ తెలిపాడు.