- Home
- Sports
- Cricket
- ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు... విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పరిస్థితి ఇది...
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు... విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పరిస్థితి ఇది...
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకి ఓ స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ఐపీఎల్‌లో 15 సీజన్లు ముగిస్తే, ఇప్పటికే 14 మంది కెప్టెన్లను మార్చింది పంజాబ్. ఇప్పుడు టీమిండియా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. జూలై 2021 నుంచి జూన్ 2022 వరకూ ఏడాదిలో టీమిండియాకి ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించడం విశేషం...

Shikhar Dhawan
2021 ఐపీఎల్ కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోవడంతో జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లింది భారత జట్టు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత ప్రధాన జట్టు, ఇంగ్లాండ్ టూర్‌కి వెళితే... శ్రీలంకలో పర్యటించిన జట్టుకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు...
లంక పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత తొలి టీ20లో ఘన విజయం అందుకున్న భారత జట్టుని కరోనా కేసులు కలవరపెట్టాయి. 8 మంది ప్లేయర్లు కరోనా నిబంధనలతో జట్టుకి దూరం కావడంతో మిగిలిన రెండు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌తో బరిలో దిగి, 2-1 తేడాతో ఓడింది ధావన్ టీమ్...
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం పెను వివాదానికి తెర తీసినట్టైంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...
టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండో టెస్టుకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించి, టెస్టు సిరీస్‌ని 1-0 తేడాతో గెలిచాడు...
సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌కి కూడా సారథిగా వ్యవహరించాడు. ఈ పర్యటనలో భారత జట్టు, టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోగా... రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది...
సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది భారత జట్టు. ఈ సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, రెండు జట్లను క్లీన్ స్వీప్ వరుసగా 15 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు..
Image credit: PTI
ఐపీఎల్ 2022 టోర్నీ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్, మొదటి టీ20 ఆరంభానికి ముందు గాయంతో తప్పుకున్నాడు. దీంతో రిషబ్ పంత్‌కి కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది బీసీసీఐ...
సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌లో పర్యటించే జట్టులో రిషబ్ పంత్‌కి చోటు దక్కడంతో... ఐర్లాండ్‌లో పర్యటించే మరో జట్టుకి హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరించబోతున్నాడు.. ఏడాది కాలంలో టీమిండియాకి కెప్టెన్‌గా చేయబోతున్న ఏడో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా...
గత 11 నెలల కాలంలో విరాట్ కోహ్లీ నుంచి శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింకా రహానే, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్లుగా అవకాశం దక్కించుకోవడం విశేషం. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే టీమ్‌లో శిఖర్ ధావన్‌కి చోటు ఇవ్వకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో పాటు ఫిట్‌నెస్‌కి మారుపేరైన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...