- Home
- Sports
- Cricket
- జో రూట్ తర్వాత టెస్టుల్లో ఆ ఫీట్ కొట్టేదెవ్వరు... రేసులో కోహ్లీ, స్మిత్, డేవిడ్ వార్నర్...
జో రూట్ తర్వాత టెస్టుల్లో ఆ ఫీట్ కొట్టేదెవ్వరు... రేసులో కోహ్లీ, స్మిత్, డేవిడ్ వార్నర్...
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ హడావుడి మొదలైపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయాన్ని అందుకుని, ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో రెండో విజయాన్ని అందుకోగలిగింది...

Joe Root
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం, వెస్టిండీస్ టూర్‌లో సిరీస్ ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జో రూట్... అజేయ సెంచరీతో చెలరేగి ఇంగ్లాండ్‌కి విజయాన్ని అందించాడు. ఇదే టెస్టులో జో రూట్, టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు...
Joe Root
118 టెస్టులు ఆడిన జో రూట్, 218 ఇన్నింగ్స్‌ల్లో 49.57 సగటుతో 10,015 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 7 టెస్టు సెంచరీలు చేసిన జో రూట్, 2019 నుంచి రెండున్నరేళ్లలో 9 సెంచరీలు నమోదు చేశాడు...
Joe Root
విరాట్ కోహ్లీ టెస్టుల్లో 27వ సెంచరీ అందుకున్న సమయంలో జో రూట్ కేవలం 18 సెంచరీలు మాత్రమే చేశాడు. రెండున్నరేళ్ల తర్వాత జో రూట్ 26 సెంచరీలకు చేరుకోగా విరాట్ మాత్రం 27వ సెంచరీ దగ్గరే ఉండిపోయాడు...
జో రూట్ తర్వాత ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉన్నారు. 101 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 49.95 సగటుతో 8043 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 85 టెస్టుల్లో 59.77 సగటుతో 8010 పరుగులు చేసి విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ ఖాతాలో 27 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పటిదాకా 94 టెస్టులు ఆడి 46.98 సగటుతో 7753 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఇప్పటిదాకా 87 టెస్టులు ఆడి 52.81 సగటుతో 7289 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
ఇప్పటిదాకా సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వస్ కలీస్, రాహుల్ ద్రావిడ్, అలెస్టర్ కుక్, కుమార్ సంగక్కర, బ్రియాన్ లారా, చంద్రపాల్, జయవర్థనే, అలెన్ బోర్డర్, స్టీవ్ వాగ్, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్ మాత్రమే జో రూట్ కంటే ముందు టెస్టుల్లో 10 వేల పరుగులు చేశారు...
టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన 15వ క్రికెటర్‌గా జో రూట్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ నిలుస్తాడా? లేక స్టీవ్ స్మిత్ ఆ రికార్డును కొడతాడా? ఈ ఇద్దరూ కాకుండా డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ దూకుడుతో ముందుగా టెస్టుల్లో 10 వేల పరుగులను అందుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది...