- Home
- Sports
- Cricket
- ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు... దగ్గర్లో కూడా లేని ఏ బ్యాటర్...
ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు... దగ్గర్లో కూడా లేని ఏ బ్యాటర్...
ఆసియా కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆగస్టు 30న ఆసియా కప్ టోర్నీ మొదలవుతోంది. సెప్టెంబర్ 2న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది..

40 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సనత్ జయసూర్య ఉంటే, టీ20ల్లో ఆ రికార్డు విరాట్ కోహ్లీదే. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదిన రికార్డు రెండు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ పేరిటే ఉంది..
2022 టీ20 ఆసియా కప్ టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 122 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీల్లో ఇదే అత్యధిక స్కోరు.
2012లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌పై 183 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది..
పాక్ ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ 105, నజీర్ జంషెడ్ 112 పరుగులు చేసి సెంచరీలు చేసుకున్నారు. ఉమర్ అక్మల్ 28, యూనిస్ ఖాన్ 52 పరుగులు చేశారు. ఈ భారీ లక్ష్యఛేదనలో గౌతమ్ గంభీర్ డకౌట్ అయ్యాడు...
సచిన్ టెండూల్కర్ 52 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 183 పరుగులు చేశాడు. సచిన్‌తో 133 పరుగుల భాగస్వామ్యం జోడించిన విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మతో కలిసి 175 పరుగుల భాగస్వామ్యం జోడించాడు..
మొదటి ఓవర్ మూడో బంతికి క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 48వ ఓవర్ వరకూ బ్యాటింగ్ చేసి అవుట్ అయ్యాడు. ఆ మిగిలిన ఓవర్లు విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి ఉంటే, వన్డేల్లో డబుల్ సెంచరీ మార్కును అందుకునే ఛాన్స్ ఉండేది! విరాట్ అవుటైన తర్వాత 4 బంతుల్లోనే మ్యాచ్‌ని ముగించేశారు సురేష్ రైనా, ధోనీ..
వన్డే ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్. 2004 ఆసియా కప్‌లో హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనిస్ ఖాన్ 122 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 144 పరుగులు చేశాడు.
అంతేకాదు ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. విరాట్ కోహ్లీ 6 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిస్తే, సనత్ జయసూర్య, షోయబ్ మాలిక్ ఐదేసి సార్లు, కుమార సంగర్కర, షోయబ్ ఆఫ్రిదీ నాలుగేసి సార్లు ఈ అవార్డులు గెలిచారు..