- Home
- Sports
- Cricket
- IPL 2022: దిగ్గజాలకు ఏమైంది..? ఇలా ఆడితే భవిష్యత్ ఎలా..! ఆందోళన కలిగిస్తున్న విరాట్-రోహిత్ వైఫల్యాలు
IPL 2022: దిగ్గజాలకు ఏమైంది..? ఇలా ఆడితే భవిష్యత్ ఎలా..! ఆందోళన కలిగిస్తున్న విరాట్-రోహిత్ వైఫల్యాలు
TATA IPL 2022 - MI vs CSK: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైరయ్యాక ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లెవరా..? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కనిపించిన ఇద్దరు ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. కానీ కొంతకాలంగా ఈ ఇద్దరి ఫామ్ టీమిండియా అభిమానులను ఆందోళన కలిగిస్తున్నది.

టీమిండియా తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఏమైంది..? ఒకప్పటిలా వాళ్లు ఎందుకు ఆడటం లేదు. ప్రస్తుతం ఏ ఒక్క భారత క్రికెట్ అభిమానిని కదిలించినా ఇదే ప్రశ్న. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. టీమిండియాతో పాటు ఐపీఎల్ లో కూడా టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఈ ఇద్దరు వెటరన్ స్టార్ క్రికెటర్లు గత కొద్దికాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదనేది గణాంకాలు చెబుతున్న వాస్తవం.
ఐపీఎల్ లో ఇంతవరకు 220 మ్యాచులు (చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కలుపుకుని) ఆడిన రోహిత్ శర్మ.. 214 ఇన్నింగ్స్ లలో 5,725 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 41 హాఫ్ సెంచరీలు కూడా అతడి ఐపీఎల్ ప్రయాణంలో భాగం. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ పరుగుల యంత్రం ఇప్పటివరకు 214 మ్యాచులు ఆడాడు. 2016 ఇన్నింగ్స్ లలో ఏకంగా 6,402 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు, 42 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
గతమెంతో ఘనంగా ఉన్నా ఈ ఇద్దరు ప్రస్తుత సీజన్ లో మాత్రం దారుణంగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్ లలో చేసిన పరుగులు 114. సగటు 16.29. అత్యధిక స్కోరు 41. ఇక విరాట్ కోహ్లి.. ఏడు ఇన్నింగ్స్ లలో చేసిన పరుగులు 119. అత్యుత్తమ స్కోరు 48. ఈ ఇద్దరూ తాము ఆడిన చివరి ఇన్నింగ్స్ లలో (కోహ్లి లక్నోతో.. రోహిత్ చెన్నైతో) డకౌట్ అవడం గమనార్హం.
ఐపీఎల్ సంగతి పక్కనబెడితే భారత జట్టు తరఫున కూడా వీళ్లు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది లేదు. సెంచరీ లేక విరాట్ కోహ్లి రెండేండ్లు గడుపుతున్నాడు. 2019 నుంచి ఇప్పటిదాకా ఆ కరువు కొనసాగుతూనే ఉంది.
రోహిత్ శర్మ అడపాదడపా రాణిస్తున్నా.. గొప్పగా ఆడిందైతే లేదు. టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్నాక వాటిని చేపట్టి వరుసగా విజయాలు సాధిస్తున్నాడన్న మాటే గానీ గతంలో మాదిరిగా భారీ ఇన్నింగ్స్ అయితే గడిచిన నాలుగు (విండీస్ తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20, టెస్టు) సిరీస్ లలో భారీ ఇన్నింగ్స్ అయితే రాలేదు.
విరాట్ కోహ్లి సారథ్య భారం దిగిపోయాక మళ్లీ ఇరగదీస్తాడని, మునపటి కోహ్లిని చూస్తారని అతడి అభిమానులతో పాటు అంతా భావించారు. కానీ అభిమానుల ఆ ముచ్చట కూడా నెరవేరడం లేదు. నాయకత్వం నుంచి తప్పుకున్నాక కోహ్లి ఆట మరీ అధ్వాన్నమైంది. టీమిండియా సారథి కాకముందు ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్.. భారత్ కు పదేండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ అందిస్తాడని బీసీసీఐ అతడిని సారథిని చేసింది. కానీ టీమిండియా సారథి అయ్యాక రోహిత్ ముంబై ని నడిపిస్తున్న తీరును చూస్తే మాత్రం భారత అభిమానులకు ఆందోళన కలగడం ఖాయం.
టీమిండియా సారథ్య బాధ్యతలే ఐపీఎల్ లో ట్రోఫీ రాకుండా నిలువరిస్తాయా..? కోహ్లి విషయంలో జరిగిందదే. ఇప్పుడు రోహిత్ కూడా అదే చిక్కుల్లో ఉన్నాడని విశ్లేషించే క్రికెట్ పండితులు కూడా ఉన్నారు. మరి ఇలా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ కు ధోని ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు కదా..? సారథ్యం భారమే కావొచ్చు గానీ మరీ సొంత ప్రదర్శన మీద కూడా ప్రభావం చూపేంతనా..? అలా అయితే స్టీవ్ వా, రికీ పాంటింగ్, అలెస్టర్ కుక్, గ్రేమ్ స్మిత్ వంటి ఆటగాళ్లు సారథులయ్యాక కూడా గొప్పగా ఆడారు కదా..? రోహిత్, కోహ్లికి ఏమైంది..? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.
కోహ్లికి విశ్రాంతినివ్వాలని, రోహిత్ ముంబై బాధ్యతలను వదిలేసి బ్యాటింగ్, టీమిండియా పై దృష్టి పెట్టాలని కొంతకాలంగా చాలా మంది సూచనలిస్తున్నారు. అప్పుడైనా వీరి నుంచి మునపటి ఆటను ఆశించొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ప్రతిపాదన దిగ్గజ ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ను మార్చి టీమిండియాకు లాభం చేకూరుస్తుందా..? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
ఏదేమైనా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్ లోకి రావడం టీమిండియాకు అత్యావశ్యకం. ఎందుకంటే ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఉండగా.. వచ్చే ఏడాది భారత్ లో వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మిగిలిన ఆటగాళ్ల సంగతేమో గానీ ఈ ఇద్దరికైతే ఈ రెండు టోర్నీలు అత్యంత కీలకం. ఇప్పటికే రోహిత్ కు 34 ఏండ్లు కాగా కోహ్లికి 33. తర్వాత జరిగే ప్రపంచకప్ టోర్నీలలో ఈ ఇద్దరూ ఆడతారా...? అనేది అనుమానమే.
జట్టులో సీనియర్ ప్లేయర్లుగా ఉన్న విరాట్-రోహిత్ లు ఎంత త్వరగా ఫామ్ ను అందుకుని రాణిస్తే అది వాళ్లకే కాదు. భారత జట్టుకూ మంచిది. జట్టులో కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి ఇప్పటికే కుదురుకున్న ఆటగాళ్లతో పాటు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి యువ ఆటగాళ్లకు మార్గం చూపాల్సిన బాధ్యత కూడా వీళ్లపై ఉంది.