వ్యాక్సిన్ వేయించుకోండి, స్టేడియానికి వచ్చి మ్యాచులు చూడండి... ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులకు...
ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెలిసిందే. భారత్‌లో 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులు సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరుగుతాయి. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న బీసీసీఐ అధికారులు, అక్కడి పరిస్థితులను పరిశీలించి, షెడ్యూల్ ఖరారు చేయబోతున్నారు.
2020 సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహించారు. అయితే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉండడం, వైరస్‌కి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో జనాలకు స్టేడియాల్లోకి అనుమతించలేదు.
ఖాళీ స్టేడియాల్లో ఆర్టిఫిషల్‌గా ఏర్పాటు చేసిన డీజే సౌండ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌కి అమితమైన ఆదరణ వచ్చింది. 2020 లీగ్‌కి రికార్డు లెవెల్లో వ్యూయర్‌షిప్ వచ్చింది.
2021 సీజన్ మ్యాచులు యూఏఈలో నిర్వహిస్తుండగా, ఈసారి ప్రేక్షకులకు అనుమతించాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. అయితే వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే స్టేడియాల్లోకి అనుమతి ఉంటుంది.
వ్యాక్సిన్ వేయించుకున్నవారికి టికెట్లు విక్రయించి, 50 శాతం ప్రేక్షకులతో మ్యాచులను నిర్వహించాలని భావిస్తున్నాయి యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ. ఈ ఐడియా వర్కవుట్ అయితే బీసీసీఐకి భారీగా ఆదాయం వస్తుంది.
ఐపీఎల్ 2021 సీజన్ ఇక్కడే నిర్వహించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించలేదు. గత ఏడాది జనాల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించిన ఐపీఎల్ 2021 సీజన్ ద్వారానే బీసీసీఐకి దాదాపు రూ.200 కోట్ల లాభం వచ్చింది.
ఇప్పటికే ఐపీఎల్ 2021 సగం మ్యాచుల ద్వారా భారీ ఆదాయం అందుకున్న బీసీసీఐ, మిగిలిన మ్యాచులను పూర్తిచేస్తే మరో రూ.2500 కోట్ల ఆదాయం రానుందని సమాచారం. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం అదనం.
దుబాయ్‌లో భారతీయుల సంఖ్య భారీగా ఉంటుంది. అలాగే షార్జా, అబుదాబిల్లో కూడా భారతీయులు నివాసం ఉంటున్నారు. భారతీయులే కాకుండా యూఏఈలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు రావచ్చు.
అదీకాకుండా మనోళ్లకి ఉన్న క్రికెట్ పిచ్చి కారణంగా భారత్ నుంచి చాలామంది అభిమానులు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి మ్యాచులు చూసేందుకు కూడా సిద్ధమవుతారు. దీంతో బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురవడం ఖాయం.