పంత్ రోడ్డు ప్రమాదానికి కారణమిదే.. ఉత్తరాఖండ్ సీఎం కీలక వ్యాఖ్యలు
Rishabh Pant Car Accident: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తుండగా రూర్కీ వద్ద పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టింది.

నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం పంత్ ను పరామర్శించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడారు.
పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అతడు కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పంత్ రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ మద్యం సేవించాడని, ఓవర్ ప్పీడ్ గా వస్తున్నాడనని ఆరోపణలున్నాయి.
కానీ పుష్కర్ సింగ్ ధామి మాత్రం.. పంత్, రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇది స్వయంగా పంత్ తనతో చెప్పిన మాటలేనని వివరించారు. ధామి మాట్లాడుతూ.. ‘ఢిల్లీ - డెహ్రాడూన్ హైవేపై వస్తుండగా రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పిందని పంత్ నాతో చెప్పాడు..’ అని అన్నారు.
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ కూడా ఇదే విషయం చెప్పడం గమనార్హం. శనివారం పంత్ ను కలిసిన శర్మ.. పంత్ గుంతను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడని చెప్పాడు. కాగా శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హరిద్వార్ జిల్లాలోని రూర్కీ సమీపంలో యాక్సిడెంట్ కు గురైన విషయం విదితమే.
అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న హర్యానాకు చెందిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజిత్ లు బస్సును ఆపి పంత్ ను ఆస్పత్రికి తరలించడంలో సాయపడ్డారు. వీరిని జనవరి 26న సత్కరిస్తామని ధామి తెలిపారు.
తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పంత్ ప్రాణాలను కాపాడటం ద్వారా, హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారని, జనవరి 26 న రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవిస్తుందని ధామి ఓ కార్యక్రమంలో చెప్పారు.