- Home
- Sports
- Cricket
- Mohammed Shami: వాళ్లు అసలు భారతీయులే కాదు.. తనను ట్రోల్ చేసేవారిపై షమీ ఘాటు వ్యాఖ్యలు
Mohammed Shami: వాళ్లు అసలు భారతీయులే కాదు.. తనను ట్రోల్ చేసేవారిపై షమీ ఘాటు వ్యాఖ్యలు
Mohammed Shami Slams Trollers: గతేడాది పాకిస్థాన్ తో టీ20 ప్రపంచకప్ సందర్భంగా మ్యాచ్ ఆడిన టీమిండియా.. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో షమీ బౌలింగ్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

సోషల్ మీడియా వేదికగా తనను ట్రోల్ చేసేవారిపై టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వాళ్లసలు భారతీయులే కాదని, వాళ్ల గురించి పట్టించుకోవడం దండగ అంటూ వ్యాఖ్యానించాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా.. అక్టోబర్ 24న విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. పది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నది పాక్. ఈ ఓటమి అనంతరం న్యూజిలాండ్ తో మ్యాచులో కూడా ఓడిన భారత జట్టు.. గ్రూప్ దశ నుంచే వైదొలిగింది.
ఈ మ్యాచ్ ఓడిపోవడంతో సోషల్ మీడియా వేదికగా జట్టుతో పాటు మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా షమీ.. ముస్లిం కావడంతోనే అతడు పాక్ గెలిచేలా బౌలింగ్ చేశాడని సామాజిక మాధ్యమాలలో కామెంట్లు వచ్చాయి.
ఈ మ్యాచులో 3.5 ఓవర్లు బౌలింగ్ వేసిన షమీ.. వికెట్ తీయకుండా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో.. షమీ మతాన్ని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియలో పెద్ద రచ్చ జరిగింది. అయితే టీమిండియాతో పాటు సీనియర్లు.. షమీకి మద్దతుగా నిలిచారు.
ఇదే విషయమై చాలా రోజుల తర్వాత షమీ స్పందించాడు. అతడు మాట్లాడుతూ... ‘ఇలా ఆలోచించేవాళ్ల (ట్రోలర్స్ ను ఉద్దేశిస్తూ..)కు ఎలాంటి చికిత్సా లేదు. మతం ఆధారంగా ట్రోల్స్ చేసేవాళ్లు నిజమైన అభిమానులు కాదు. అసలు వాళ్లు నిజమైన భారతీయులు కూడా కాదని నా అభిప్రాయం.
ఒక ఆటగాడిని హీరోలా ఆరాధిస్తే.. ఇలా ప్రవర్తించకూడదు. అలా చేస్తే మీరు ఇండియన్ సపోర్టరే కాదు. ఇలాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలను, విమర్శలను నేను పట్టించుకోను.
నేనెవరినైనా నా రోల్ మోడల్ గా భావిస్తే వాళ్ల గురించి తప్పుగా మాట్లాడను. నా గురించి ఎవరైనా బాధపెట్టే విధంగా మాట్లాడితే అతడు నా అభిమానే కాదు.. భారత జట్టుకూ అభిమాని కాలేడు.
ఇది తక్కువ స్థాయి వ్యక్తుల ఆలోచన. వారికి సరైన విద్య లేదని దీని ద్వారా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ లు పెట్టి లేదా కొంతమంది ఫాలోవర్లు ఉన్నవాళ్లు ఎవర్నైనా వేలెత్తి చూపెట్టినప్పుడు వాళ్లు కోల్పోయేది ఏమీ ఉండదు. కానీ ఒక సెలబ్రిటీగా మనం కూడా వారి వ్యాఖ్యలకు స్పందిస్తే.. మనమే వాళ్లకు అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నట్టు.. అటువంటి వాళ్ల గురించి ఆలోచించడం కూడా దండగ..
మేమేంటో మాకు బాగా తెలుసు. దేశంపై నాకున్న అభిమానం గురించి ఎవరిదగ్గర శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము దేశం కోసం ప్రాతినిథ్యం వహిస్తున్నాం. దేశం కోసం పోరాడతాం. ఇలాంటి పనికిమాలిన ట్రోల్స్ పై స్పందించడొ ద్వారా మా దేశభక్తిని ఎవరిదగ్గరా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..’ అని షమీ అన్నాడు.
నిజమైన అభిమాని అంటే.. ఆటను అర్థం చేసుకుంటాడని, ఇలా అడ్డదిడ్డంగా వాగడని షమీ చెప్పాడు. ‘నిజమైన అభిమానులు, క్రికెట్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు దీనిని అర్థం చేసుకుంటారు. ఆ మ్యాచులో పరుగులిచ్చినందుకు నేను కూడా బాధపడ్డాను. దానికి నేను కూడా నిరాశ చెందాను. నా సహచరులతో పాటు చాలా మంది అభిమానులు నాకు మద్దతుగా నిలిచారు. నేను వాళ్లను గౌరవిస్తాను.
నిజమైన అభిమానులు. వాళ్లు నిరాశ చెందారని నేను అర్థం చేసుకోగలను. అయినా ఆటలో గెలుపోటములు సహజం. మేము కూడా మానవమాత్రులమే కదా.. తప్పులు చేస్తాము కదా. కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు.. ఆ మ్యాచులో మేం మా ప్లాన్స్ ను సరిగ్గా అవలంభించలేదు. దానికి నేను అంగీకరిస్తున్నా.. కానీ మనం ప్రతిసారి గెలవలేం కదా..’ అని షమీ చెప్పాడు.