- Home
- Sports
- Cricket
- మమ్మల్ని చాలా విసిగించారు.. వాళ్లిద్దరూ లోయరార్డర్ బ్యాటర్లు ఏంటి? అక్షర్ అశ్విన్‌లపై ఆసీస్ స్పిన్నర్ కామెంట్
మమ్మల్ని చాలా విసిగించారు.. వాళ్లిద్దరూ లోయరార్డర్ బ్యాటర్లు ఏంటి? అక్షర్ అశ్విన్‌లపై ఆసీస్ స్పిన్నర్ కామెంట్
INDvsAUS 2nd Test: ఢిల్లీ టెస్టులో టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లు భారత్ ను ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో అక్షర్- అశ్విన్ లు 8వ వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయానికి చేరువవుతున్నది. తొలి ఇన్నింగ్స్ లో కాస్తో కూస్తో రాణించిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. భారత స్పిన్నర్ల ధాటికి 113 పరుగులకే చాప చుట్టేశారు. ఫలితంగా భారత్ ముందు 114 పరుగుల లక్ష్యం నిలిపింది.
అయితే తొలి ఇన్నింగ్స్ లో భారత్ కూడా అంత గొప్పగా రాణించలేదు. టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లీ (44), రోహిత్ శర్మ (32) ఫర్వాలేదనిపించగా.. కెఎల్ రాహుల్ (17), పుజారా (0), రవీంద్ర జడేజా (26), శ్రేయాస్ అయ్యర్ (4), శ్రీకర్ భరత్ (6) నిరాశపరిచారు. ఒకదశలో భారత్.. 139 పరుగులకే ఏడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లు భారత్ ను ఆదుకున్నారు. అక్షర్.. 74 పరుగులు చేయగా అశ్విన్ 37 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 8వ వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి పోరాటం ఫలితంగానే భారత్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (263) కంటే ఒక్క పరుగు మాత్రమే తక్కువ చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా పతనం శాసించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అక్షర్, అశ్విన్ లపై ప్రశంసలు కురిపించాడు. వారిద్దరినీ లోయరార్డర్ బ్యాటర్లు అనొద్దని అన్నాడు. అక్షర్, అశ్విన్ లు టాపార్డర్ బ్యాటర్లే అని ఖాయం చేశాడు.
రెండో రోజు ఆట ముగిశాక లియాన్ మాట్లాడుతూ.. ‘నేను మీకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. అక్షర్, అశ్విన్ లు ఎంతమాత్రమూ లోయరార్డర్ బ్యాటర్లు కాదు. అది క్లీయర్. ఒక జట్టులో టాప్-6 బ్యాటర్లతో సమానంగా పోటీ పడి ఆడగల సామర్థ్యం ఉన్నవాళ్లు. భారత్ కు లోతైన టాపార్డర్ ఉంది. అక్షర్, అశ్విన్ ల ఆట చూశాక వారిని ఎవరూ లోయరార్డర్ బ్యాటర్లు అని అనరు..’అని చెప్పాడు.
కాగా ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో నిన్న (శనివారం) జోరుగా ఆడిన ఆస్ట్రేలియన్లు నేడు చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి పెవిలియన్ కు క్యూ కట్టారు. అశ్విన్, జడ్డూ ధాటికి ఆసీస్.. చివరి ఏడుగురు బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. స్టీవ్ స్మిత్, లబూషేన్, రెన్షా, హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ లియాన్, మర్ఫీలు అలా వచ్చి ఇలా వెళ్లారు. జడ్డూ ఏడు వికెట్లతో చెలరేగగా అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి.