- Home
- Sports
- Cricket
- ఇప్పుడు ‘వహ్వా’ అన్నోళ్లే బాగా ఆడకుంటే ‘ఛీ.. పో’ అంటారు.. వాళ్లకు నా గురించి తెలియదు : రింకూ సింగ్
ఇప్పుడు ‘వహ్వా’ అన్నోళ్లే బాగా ఆడకుంటే ‘ఛీ.. పో’ అంటారు.. వాళ్లకు నా గురించి తెలియదు : రింకూ సింగ్
Rinku Singh: ఐపీఎల్ -16 లో గుజరాత్ తో మ్యాచ్ లో ఐదు వరుస సిక్సర్లను బాది ఓవర్ నైట్ స్టార్ గా మారిన రింకూ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను ఇప్పుడు అందరూ పొగుడుతున్నారని.. కానీ తాను బాగా ఆడకుంటే తనను పొగిడినవాళ్లే తిడతారని...

Image credit: PTI
ప్రతి ఏడాదీ మాదిరిగానే ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా భారత జట్టుకు పలువురు టాలెంటెడ్ క్రికెటర్లను అందజేసింది. ఇందులో ముందువరుసలో ఉండే పేరు రింకూ సింగ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుర్రాడు.. ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో రింకూ.. కేకేఆర్‌కు ఫినిషర్ గా ఒకరకంగా ‘సేవియర్ ’ గా మారాడు.
Image credit: PTI
ఐపీఎల్-16 సీజన్ కొత్తలో గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్కతా విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అసవరం కాగా రింకూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. పంజాబ్ తో మ్యాచ్ లో ఆఖరి బాల్ బౌండరీ బాది గెలిపించిన రింకూ.. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో కూడా కేకేఆర్ ను గెలిపించినంత పనిచేశాడు.
ఈ సీజన్ లో మెరుగ్గా ఆడిన రింకూ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ఇప్పుడు అందరూ పొగుడుతున్నారని.. కానీ తాను బాగా ఆడకుంటే తనను పొగిడినవాళ్లే తిడతారని రింకూ అన్నాడు. చాలామందికి తన సక్సెస్ మాత్రమే తెలుసునని.. కష్టం తెలియదని తెలిపాడు.
రింకూ మాట్లాడుతూ.. ‘నేను గతంలో ఎలా ఆడానో ఇప్పుడూ అలాగే ఆడాను. కానీ ఆ ఐదు సిక్సర్లు నా లైఫ్ ను మార్చాయి. అంతకుముందు నేను చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఐదు సిక్సర్ల తర్వాత నా పేరు చాలా మందికి తెలిసింది. ఈడెన్ గార్డెన్ లో క్రౌడ్ రింకూ రింకూ అనడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత పరిస్థితులు చాలా మారాయి.
ఇదంతా రెండు నిమిషాల ఫేమ్. నేను ఎక్కడ్నుంచి వచ్చానో నాకు తెలుసు. ఇప్పుడు నన్ను పొగుడుతున్నవారే రేపు నేను బాగా ఆడకుంటే నా మీద రాళ్లు విసరతారు. ఆ విషయం నాకు తెలుసు. చాలా మందికి నా సక్సెస్ మాత్రమే తెలుసు గానీ నా కష్టం తెలియదు. నేను చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.
నాకు ఆర్థికంగానే కాదు నేను పెద్దగా చదువుకుంది కూడా లేదు. మా కుటుంబం గడవడానికి మా అమ్మ నన్ను స్వీపర్ పని చేయమంది. ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటపడేసింది క్రికెట్ ఒక్కటే. అందుకోసం నేను ఎంతటి హార్డ్ వర్క్ చేయడానికైనా రెడీ. నా ఇన్నేళ్ల ప్రయాణంలో చాలా మంది చాలా రకాలుగా నాకు సాయం చేశారు. గత కొంతకాలంగా కేకేఆర్ నాకు అండగా నిలిచింది. అందుకే నేను ఇక్కడున్నా..’అని చెప్పాడు.