- Home
- Sports
- Cricket
- ఆ విషయంలో గంగూలీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు : బీసీసీఐ బాస్ కు మద్దతుగా నిలిచిన సంజయ్ మంజ్రేకర్
ఆ విషయంలో గంగూలీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు : బీసీసీఐ బాస్ కు మద్దతుగా నిలిచిన సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar On Sourav Ganguly: వారం పదిరోజుల క్రితం భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు తెరతీసిన టీమిండియా వైస్ కెప్టెన్సీ వివాదంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో స్పందించాడు.

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు దారితీసిన టీమిండియా వన్డే కెప్టెన్సీ వివాదంపై సీనియర్ క్రికెటర్ల విశ్లేషణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
టీమిండియా టెస్టు సారథి కోహ్లీ.. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మీద చేసిన వ్యాఖ్యలు.. అంతకుముందు విరాట్ కెప్టెన్సీ వివాదంపై దాదా చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ సాగింది. ఇది కాస్తా.. బీసీసీఐ వర్సెస్ విరాట్ కోహ్లీగా మారింది.
తాను చెప్పినా వినకుండా విరాట్ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడని గంగూలీ వ్యాఖ్యానించడం.. అలాంటిదేమీ లేదని కోహ్లీ చెప్పడంతో ఈ విషయమ్మీద గంగూలీ సమాధానం చెప్పాలని, దీనికి ముగింపు పలికేది దాదా మాత్రమేనని చాలా మంది డిమాండ్ చేశారు.
అయితే తాజాగా ఈ వివాదంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. గంగూలీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పన్లేదని, అది సెలెక్టర్లు చూసుకుంటారని తెలిపాడు.
మంజ్రేకర్ మాట్లాడుతూ... ‘మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు అనేది భారత జట్టుకు అంత సూట్ కాదు. ఇక భారత క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ విషయానికొస్తే.. వివాదానికి కేంద్ర బింధువు అయిన వ్యక్తి సెలెక్టర్లకు చైర్మన్. అసలు అతడు ఎందుకు ప్రజల ముందుకు రావాలి...?
అతడు (బీసీసీఐ చీఫ్) ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పన్లేదు. బీసీసీఐ చైర్మన్ హోదాలో ఉండి అతడు ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు..’ అని అన్నాడు.
అంతేగాక.. ‘అపర్థాలు, సమాచార లోపం అనేది భారత క్రికెట్ లో కొత్తగా వచ్చినవి కాదు. ఇది గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది... ’ అని మంజ్రేకర్ చెప్పాడు.
ఈ సందర్భంగా మంజ్రేకర్.. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ కు ఆసీస్ క్రికెట్ బోర్డుకు జరిగిన వ్యవహారాన్ని గుర్తు చేశాడు. అప్పుడు ఆసీస్ బోర్డు పాంటింగ్ కు ఒక అవకాశమివ్వాలని ఫ్యాన్స్ కోరినా క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అందుకు అంగీకరించలేదని ఉదహరించాడు. దీంతో పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని చెప్పాడు.