- Home
- Sports
- Cricket
- రోహిత్ పెద్దగా చేసిందేమీ లేదు.. కెప్టెన్సీలో అతడి మార్క్ జీరో.. అంతా కోహ్లీదే : గంభీర్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ పెద్దగా చేసిందేమీ లేదు.. కెప్టెన్సీలో అతడి మార్క్ జీరో.. అంతా కోహ్లీదే : గంభీర్ షాకింగ్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ చేసిందేమీ లేదంటున్నాడు భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్. ఢిల్లీ టెస్టు విజయం తర్వాత గౌతీ ఈ కామెంట్స్ చేశాడు.

2021 చివర్లో విరాట్ కోహ్లీ నుంచ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఓటమనేదే లేకుండా టీమ్ ను నడిపిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇంతవరకూ స్వదేశంలో ఏ ఫార్మాట్ లో కూడా ఒక్క సిరీస్ ను కోల్పోలేదు.
వైట్ బాల్ క్రికెట్ లో ఓకే గానీ టెస్టు క్రికెట్ లో హిట్‌మ్యాన్ జట్టును ఎలా నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తిగా ఉండేది. వాస్తవానికి ఈ రెండేండ్లలో రోహిత్ టెస్టులలో భారత్ కు కెప్టెన్ గా ఉన్నది నాలుగు టెస్టులే కావడం గమనార్హం. గతేడాది శ్రీలంకతో రెండు టెస్టులు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులకు సారథిగా ఉన్నాడు. గతేడాది ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్ టెస్టులో అతడు కరోనా కారణంగా ఆడకపోవడంతో బుమ్రాను సారథిగా నియమించారు.
అయితే వన్డేలు, టీ20లలో తన మార్కు ప్రయోగాలతో భారత్ ను నడిపిస్తున్న రోహిత్.. టెస్టులలో మాత్రం కోహ్లీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను ఉపయోగించడంలో రోహిత్.. కోహ్లీ చేసిందే చేస్తున్నాడు తప్ప తనకంటూ కొత్త మార్కును సృష్టించుకోవడం లేదని చెప్పాడు.
ఢిల్లీ టెస్టు ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అని నేను నమ్ముతాను. కానీ జట్టును నడిపించే విషయంలో కోహ్లీ - రోహిత్ ల మధ్య పెద్ద సారుప్యత లేదు. మరీ ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో అయితే రోహిత్.. కోహ్లీ చేసినదానినే ఫాలో అవుతున్నాడు.
తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు కోహ్లీ తనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నాడు. స్పిన్నర్లను ఉపయోగించుకోవడం, పరిస్థితులకు తగ్గట్టు పేసర్లను వాడటం వంటివాటిలో కోహ్లీ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. రోహిత్ ఇప్పుడు అదే విధానాన్ని పాటిస్తున్నాడనిపిస్తుంది. జడేజా, అశ్విన్ ను విరాట్ మాదిరిగానే హిట్ మ్యాన్ వాడుతున్నాడు..’అని చెప్పాడు.
రోహిత్ కు ప్రస్తుతం స్వదేశంలో సిరీస్ లు జరుగుతున్నాయి కాబట్టి వచ్చిన నష్టమేమీ లేదని అసలైన సవాల్ విదేశాల్లోనే ఎదురవుతుందని గంభీర్ చెప్పాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అక్కడ టీమ్ ను ఎలా నడిపిస్తాడో చూడాలని గంభీర్ తెలిపాడు.