ఇంగ్లాండ్ పంథాను అనుసరించడమే ఉత్తమం.. కెప్టెన్‌ను మార్చాల్సిందే.. : రవిశాస్త్రి
టీ20 ప్రపంచకప్ లో ఓటమి భారత జట్టును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. బిజీ షెడ్యూల్ కారణంగా భారత సారథి రోహిత్ శర్మ, ఇతర సీనియర్లు ఆడుతున్న ఆటకు విరామమిచ్చి పొట్టి ఫార్మాట్ కు కొత్త జట్టుతో పాటు సారథిని ఎంపిక చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రపంచకప్ లో ఓటమి భారత జట్టుకు గుణపాఠాలు నేర్పుతున్నది.ఈ ఓటమి అనంతరం భారత క్రికెట్ జట్టు మాజీలంతా జట్టును విమర్శించాల్సినంత విమర్శించి ఆ తర్వాత కీలక సూచనలు చేస్తున్నారు. బీసీసీఐ ఇప్పటికైనా మేల్కొని టెస్టు, వన్డేలకు ఓ టీమ్, టీ20 లకు ఓ జట్టునూ తయారుచేయాలని సూచిస్తున్నారు. సీనియర్లకు పొట్టి ఫార్మాట్ లో విశ్రాంతినిచ్చి యువరక్తాన్ని నింపాలని వాదిస్తున్నారు.
మరీ ముఖ్యంగా టీ20లకు ప్రత్యేకమైన సారథిని నియమించడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చేరాడు. శాస్త్రి విలేకరులతో మాట్లాడుతూ.. టీ20లకు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడం తప్పేమీ కాదని.. ఇంగ్లాండ్ పంథాను అనుసరించడమే ఉత్తమమని సూచిస్తున్నాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘టీ20 క్రికెట్ లో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న పంథా ఆచరణీయంగా ఉంది. ఈ ఫార్మాట్ లో భారత్ కు కొత్త కెప్టెన్ ను నియమించడం తప్పేమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ ఆడుతున్న క్రికెట్ చూడండి. మనకు బిజీ షెడ్యూల్ ఉంది. మూడు ఫార్మాట్లలోనూ ఊపిరిసలపని క్రికెట్ఆడాల్సి ఉంది.
Image credit: PTI
ఒక ఆటగాడు (రోహిత్ ను ఉద్దేశిస్తూ) ఇన్ని భారాలు మోయడం చాలా కష్టం. రోహిత్ టెస్టులు, వన్డేలను నడిపిస్తే టీ20లకు కొత్త సారథిని వెతకాలి. ఆ పేరు హార్ధిక్ పాండ్యా అయితే మరీ మంచిది..’అని తెలిపాడు. శాస్త్రి చెప్పినట్టు.. ఇంగ్లాండ్ కు టెస్టులలో బెన్ స్టోక్స్ సారథిగా ఉండగా పరిమిత ఓవర్లలో జోస్ బట్లర్ కెప్టెన్ గా ఉన్నాడు.
ఇదిలాఉండగా టీ20 ప్రపంచకప్ తర్వాత వినిపిస్తున్న కెప్టెన్సీ మార్పు ఊహాగానాలపై బీసీసీఐ ఆచితూచి అడుగులువేస్తున్నది. ఇప్పటికిప్పుడు రోహిత్ ను జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం.. అతడిని టీమ్ నుంచి కూడా పంపడం చేయకపోవచ్చు. ఆ నిర్ణయాన్ని అతడికే వదిలేయొచ్చని తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇది చాలా కీలక అంశం. అయితే మేం దీనిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. టీ20 ప్రపంచకప్ -2024 కు గానూ మేం చర్చించాల్సి ఉంది. రోహిత్ , రాహుల్ ద్రావిడ్ లతో చర్చించినాక వచ్చే ఏడాది జనవరిలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం. అప్పటిదాకా రోహితే అన్ని ఫార్మాట్లకూ సారథిగా ఉంటాడు...’ అని చెప్పాడు.
ఇక న్యూజిలాండ్ తో సిరీస్ హార్ధిక్ పాండ్యాకు చాలా కీలకం. న్యూజిలాండ్ చాలా పటిష్టమైన జట్టు. అదీగాక ఆడుతున్నది కివీస్ లోనే. దీంతో అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరం. ఈ పర్యటనలో పాండ్యా గనక సక్సెస్ అయితే అతడికి భవిష్యత్ సారథ్య పగ్గాలు దక్కినట్టే.