- Home
- Sports
- Cricket
- భారత్ అంటే ఆ దేశానికి తప్ప అన్నింటికీ అసూయ.. ఈసారి వరల్డ్ కప్ వాళ్లకే అంటున్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్
భారత్ అంటే ఆ దేశానికి తప్ప అన్నింటికీ అసూయ.. ఈసారి వరల్డ్ కప్ వాళ్లకే అంటున్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ వన్డే వరల్డ్ కప్ విజేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ అంటే చాలా దేశాలకు అసూయ ఉందన్న స్వాన్..

ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ గురించి ఇప్పుడే జోరుగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో ఫేవరేట్లు ఎవరు..? ఎవరు గెలుస్తారు..? తదితర అంశాలపై ఆటలోని నిపుణులు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా ఈ జాబితాలో చేరాడు.
అయితే అతడు ఎవరూ ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ పేరు చెప్పడం విశేషం. అందుకు గల కారణాలను కూడా అతడు వివరించాడు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి స్పిన్నర్లు ఉండటం వారికి ఎంతో మేలే చేసేదని జియో సినిమాలో వస్తున్న ఐపీఎల్ -16లో భాగంగా ఓ చర్చలో స్వాన్ అభిప్రాయపడ్డాడు.
స్వాన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి భారత్ లో మణికట్టు స్పిన్నర్లు ఉన్నందుకు క్రికెట్ ఆడే ప్రతి దేశం అసూయపడుతుంది. ఇక్కడ చాలా మంది రిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ ఆఫ్గానిస్తాన్ ఒక్కటే దానికి మినహాయింపు. ఆ జట్టుకు కూడా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ల రూపంలో అద్భుతమైన మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు.
ప్రపంచంలో ఇప్పుడు వాళ్లిద్దరూ బెస్ట్ రిస్ట్ స్పిన్నర్స్ అని చెప్పక తప్పద. ఈ ఇద్దరూ ఆఫ్గాన్ జట్టుకు ఆస్తి. వీళ్లిద్దరూ ఇదే ఫామ్ కొనసాగిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ ను ఆప్గాన్ గెలచుకునే అవకాశం లేకపోలేదు..’ అని అభిప్రాయపడ్డాడు.
కాగా రషీద్, నూర్ లు ప్రస్తుతం గుజరాత్ తరఫున ఆడుతున్నారు. నూర్ అహ్మద్ ఇప్పుడిప్పుడే ఐపీఎల్ లో అడుగులు వేస్తున్నా రషీద్ ఖాన్ 2017 నుంచే ఈ లీగ్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 103 మ్యాచ్ లలో 103 వికెట్లు తీసిన రషీద్.. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లలో 19 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఈ ఏడాదిలోనే ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన నూర్ అహ్మద్.. 7 మ్యాచ్ లలో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరూ కలిసి గుజరాత్ టైటాన్స్ కు 30 వికెట్లు పడగొట్టడం విశేషం. మిడిల్ ఓవర్స్ లో ఈ ఇద్దరూ ఆ జట్టుకు కీలకంగా మారుతున్నారు. ఆ జట్టు విజయాలలో నూర్, రషీద్ లది కీలక పాత్ర.