- Home
- Sports
- Cricket
- Ashes: గ్రేమ్ స్మిత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ సారథి.. ఇక నెక్స్ట్ టార్గెట్ ఆ లెజెండ్ బ్యాటర్ దే..?
Ashes: గ్రేమ్ స్మిత్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ సారథి.. ఇక నెక్స్ట్ టార్గెట్ ఆ లెజెండ్ బ్యాటర్ దే..?
Joe Root: యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ విఫలమవుతున్నా ఆ జట్టు సారథి జో రూట్ మాత్రం వ్యక్తిగత రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా అతడు దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ రికార్డు బద్దలు కొట్టాడు. అదేంటంటే..?

యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఫ్లాఫ్ షో కొనసాగుతున్నది. తొలి రెండు టెస్టులలో ఓడిన ఇంగ్లాండ్.. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కూడా తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 185 పరుగులకే ఆలౌట్ అయింది.
కాగా.. ఈ టెస్టులో ఇంగ్లాండ్ సారథి జో రూట్ మరో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ రికార్డును బద్దలుకొట్టాడు.
క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్.. మూడో స్థానంలో ఉన్నాడు. స్మిత్.. 2008లో క్యాలెండర్ ఇయర్ లో టెస్టులలో 1,656 పరుగులు చేశాడు. రూట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అతడు ప్రస్తుతం 1680 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2006లో యూసుష్ 1,788 రన్స్ చేశాడు.
అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ పేరిట ఉండేది. 1976లో రిచర్డ్స్.. ఒక ఏడాదిలో 1,710 పరుగులు సాధించాడు.
మరో 31 పరుగులు చేస్తే రూట్.. రిచర్డ్స్ ను అధిగమించే అవకాశముంది. అంతేగాక మరో 109 పరుగులు చేస్తే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో అతడు ఏ మేరకు రాణిస్తాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.
ఇదిలాఉండగా.. ఆసీస్ పై యాషెస్ సిరీస్ లో మెరుగైన ప్రదర్శనలు చేస్తున్న రూట్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఆసీస్ పై ఆసీస్ లో ఇప్పటివరకు రూట్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆసీస్ లో పర్యాటక జట్టు సారథుల్లో ఎవరికీ ఈ రికార్డు లేదు. అదే సమయంలో ఆసీస్ లో అతడు సెంచరీ మాత్రం చేయలేదు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 185 పరుగులకే ఆలౌట్ కాగా ఆసీస్ మాత్రం నిలకడగా ఆడుతున్నది. తొలి ఇన్నింగ్సులో ఆ జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది.
గత రెండు టెస్టులలో సెంచరీకి దగ్గరగా వచ్చి ఆగిపోయిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38) ఈసారి త్వరగానే ఔటయ్యాడు. 42 బంతుల్లో 38 పరుగులు చేసిన వార్నర్.. అండర్సన్ బౌలింగ్ లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మార్కస్ హారిస్ (16 నాటౌట్), నాథన్ లియాన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.