గీత దాటితే రూ.కోటి కట్టాల్సిందే... ఐపీఎల్ 2021 అనుభవాలతో మరింత కఠినంగా రూల్స్...
రెండేళ్ల తర్వాత ప్రేక్షకులతో నిండిన స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. పూర్తిగా మహారాష్ట్రలోని మూడు వేదికల్లోనే జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించి కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ ఇండియాలోనే ప్రారంభమైంది. అయితే అప్పటికే కరోనా సెకండ్ వేవ్ కేసులు ప్రారంభం కావడంతో ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించారు...
అయితే 29 మ్యాచులు ముగిసిన తర్వాత బయో బబుల్‌లో ఒక్క రోజు గ్యాప్‌లో ఐదుకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అవాక్కవ్వడం బీసీసీఐ వంతైంది...
గాయానికి స్కానింగ్ చేయించుకోవడం కోసం బయో బబుల్ దాటి బయటికి వెళ్లిన కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆ విషయాన్ని దాచిపెట్టి జట్టులో చేరడమే ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా కేసులు వెలుగుచూడడానికి కారణమని వార్తలు వినిపించాయి...
వరుణ్ చక్రవర్తితో పాటు అతని టీమ్ మేట్ సందీప్ వారియర్, సన్‌రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ ప్లేయర్ అమిత్ మిశ్రా, సీఎస్‌కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథ్, కేకేఆర్ ప్లేయర్ నితీశ్ రాణా, అక్షర్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్, డానియల్ సామ్స్‌తో పాటు పలువురు గ్రౌండ్ సిబ్బంది కూడా కరోనా పడ్డారు...
కట్టుదిట్టమైన బయో బబుల్ ఏర్పాటు చేసి ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు నిర్వహించినప్పటికీ ఈ స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేసింది బీసీసీఐ...
ఐపీఎల్ 2022 సీజన్ బయో బబుల్‌లోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదు. ప్లేయర్లు, ఒకవేళ బయో బబుల్ దాటి బయటికి వెళితే 7 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి జట్టులో కలవాల్సి ఉంటుంది...
బయో బబుల్ దాటి బయటికి వెళితే క్వారంటైన్‌లో ఉండే 7 రోజులకు ప్లేయర్లకు ఎలాంటి మొత్తం చెల్లించడం జరగదు. బయో బబుల్ దాటితే జట్టుకి అందుబాటులో లేనట్టుగానే పరిగణిస్తారు...
ఏ ప్లేయర్‌ని అయినా బయో బబుల్ దాటి బయటికి వెళ్లనిచ్చి, క్వారంటైన్ పూర్తి కాకుండానే లోపలికి అనుమతిస్తే... సదరు ప్లేయర్‌పై ఓ మ్యాచ్ బ్యాన్ విధిస్తారు...
అయినా మారకుండా బయో బబుల్ నిబంధనలను అతిక్రమిస్తే, ఆ ప్లేయర్‌ను ఐపీఎల్ నుంచి బహిష్కరిస్తారు. అలాగే అతన్ని బయటికి వెళ్లనిచ్చినందుకు ఆ ఫ్రాంఛైజీకి మరో ప్లేయర్‌ని రిప్లేస్‌మెంట్‌గా తీసుకునే అవకాశం ఉండదు.
ఒకవేళ ఏ జట్టు అయినా 7 రోజుల క్వారంటైన్ పూర్తి కాకుండానే బయటి వ్యక్తులను బయో బబుల్‌లోకి తీసుకు వస్తే... రూ.1 కోటి జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది...
జరిమానా కట్టిన తర్వాత కూడా బయటి వ్యక్తులను బయో బబుల్‌లోకి అనుమతించినట్టు తేలితే... ఆ టీమ్‌కి పాయింట్ల పట్టికలో ఓ పాయింట్ కోత విధిస్తారు...
అయినా బయటి వ్యక్తులను బయో బబుల్‌లోకి అనుమతిస్తే ఆ ఫ్రాంఛైజీకి 2 పాయింట్లు కోత విధించడంతో పాటు రూ.3 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు...