మొన్న విండీస్, నిన్న ఇంగ్లాండ్, నేడు పాకిస్తాన్! వరల్డ్ కప్ విజేతలకు వరుస షాక్‌లు... టీమిండియాకి హెచ్చరికే...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సంచలనాలకు వేదికగా మారింది. క్వాలిఫైయర్స్ రౌండ్ మొదటి మ్యాచ్ నుంచి అసోసియేట్ దేశాలు, టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించి, షాక్ ఇస్తూనే ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక, ఆ తర్వాత వెస్టిండీస్, ఇంగ్లాండ్... నిన్న పాకిస్తాన్ జట్టుకి పసికూనల చేతుల్లో ఘోర పరాజయాలు ఎదురయ్యాయి.
ఆసియా కప్ 2022 టైటిల్ విజేతగా భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ప్రారంభించింది శ్రీలంక. అయితే క్వాలిఫైయర్స్ రౌండ్ తొలి మ్యాచ్‌లో నమీబియా చేతుల్లో ఊహించని పరాజయాన్ని చవిచూసింది లంక. అలా ఇలా కాదు, ఏకంగా 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది శ్రీలంక...
2014 టీ20 వరల్డ్ కప్ విన్నర్ శ్రీలంక తొలి మ్యాచ్ ఓటమి తర్వాత కోలుకుని, వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సూపర్ 12 రౌండ్‌కి రాగలిగింది. గ్రూప్ బీలో వెస్టిండీస్‌కి మాత్రం వరుస షాక్‌లు తగిలాయి. తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో 42 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన వెస్టిండీస్, ఆ తర్వాత జింబాబ్వేపై గెలిచినా ఐర్లాండ్ చేతుల్లో ఓడి క్వాలిఫైయర్స్ రౌండ్ కూడా దాటలేకపోయింది.
రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక జట్టుగా ఉన్న వెస్టిండీస్ జట్టు, ఈసారి క్వాలిఫైయర్స్ రౌండ్ ఆడడమే పెద్ద అవమానం అనుకుంటే... సూపర్ 12 రౌండ్‌కి కూడా అర్హత సాధించకుండా ఇంటిదారి పట్టడమనేది ఎవ్వరూ ఊహించని పరిణామం...
Ireland win
2010 టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఇంగ్లాండ్‌కి పసికూన ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. డీఎల్‌ఎస్ విధానం ప్రకారం 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ని ఓడించింది. వర్షం వల్లే ఓడిపోయామని ఇంగ్లాండ్ ఎన్ని కబుర్లు చెప్పినా... ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ చూపించిన డామినేషన్‌ని ఎవ్వరూ కాదనలేరు...
Pakistan vs Zimbabwe
తాజాగా మొట్టమొదటిసారిగా టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించిన జింబాబ్వే... పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ మరో రెండు ఓవర్లు సాగి ఉంటే జింబాబ్వే చిత్తుగా ఓడాల్సింది. అయితే వరుణుడి రాకతో పాటు లక్ కలిసొచ్చి ఆ మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయ్యి జింబాబ్వే ఖాతాలో ఓ పాయింట్ చేరింది...
ప్రస్తుతం 3 పాయింట్లతో ఉన్న జింబాబ్వే, సెమీస్ రేసులో నిలిచింది. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లతో జరిగే మ్యాచుల్లో జింబాబ్వే గెలిస్తే... సెమీ ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ రిజల్ట్స్, టాప్ టీమ్స్‌కి హెచ్చరికే. అసోసియేట్ దేశాలతో మ్యాచ్ అనగానే ఎలాగైనా గెలుస్తామని తేలిగ్గా తీసుకుంటున్నాయి టాప్ టీమ్స్... ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేస్తోంది...
India vs Netherlands
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలిచిన తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడింది భారత జట్టు. చిన్న జట్టే కదా అని టీమ్‌లో మార్పులు చేసి ప్రయోగాల జోలికి పోలేదు. ఇదే టీమిండియాని కాపాడింది. నెదర్లాండ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు... ఆఖరి 5 ఓవర్ల వరకూ భారత స్కోరు 150+ దాటుతుందా అనే అనుమానాలు కూడా రేగాయంటే అది డచ్ బౌలర్ల బౌలింగ్ ప్రభావమే...
భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలబడనుంది. సఫారీ జట్టు జోరును అడ్డుకోవాలంటే టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మ్యాచులు ఉంటాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో, ఈ రెండు మ్యాచుల్లో గెలవడం కూడా టీమిండియాకి అంతే ముఖ్యం...
కాబట్టి చిన్న జట్లే కదా అని తేలిగ్గా తీసుకుని ప్రయోగాలతో టీమ్‌ని కష్టాల్లో నెట్టకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు టీమిండియా అభిమానులు. 2009, 2010, 2012, 2014 టీ20 వరల్డ్ కప్ విజేతలకు అసోసియేట్ దేశాల చేతుల్లో షాకులు తగిలినట్టే, 2007 విజేతకు తగలకుండా చూసుకోవాలని కోరుకుంటున్నారు...