భారత బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్! ఆ సీనియర్ ప్లేయర్ సపోర్టుతో...
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకున్న తర్వాత భారత జట్టులో చాలా మార్పులు జరిగాయి. కొత్త కెప్టెన్, కొత్త వైస్ కెప్టెన్లతో టీమిండియా సరికొత్తగా తయారైంది. అయితే కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి...

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నప్పుడే అతనితో పాటు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే బాధ్యతలు తీసుకున్నాడు...
రాహుల్ ద్రావిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న సమయంలో బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు పరాస్ మాంబ్రే... మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ వంటి యంగ్ ఫాస్ట్ బౌలర్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు...
అయితే భారత బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే సేవలపై ఓ భారత సీనియర్ క్రికెటర్ సంతృప్తికరంగా లేడని వార్తలు వస్తున్నాయి...
పరాస్ మాంబ్రే స్థానంలో భారత మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్‌ను ఆ పొజిషన్‌లోకి తీసుకు రావాలని సదరు క్రికెటర్, గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడట...
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడిన అజిత్ అగార్కర్... మొత్తంగా 349 వికెట్లు పడగొట్టాడు...
వన్డే ఫార్మాట్‌లో 27.85 సగటుతో 288 వికెట్లు తీసిన అజిత్ అగార్కర్, 21 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అత్యంత వేగంగా అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...
‘టీమిండియాలో నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ భారత సీనియర్ క్రికెటర్, అజిత్ అగార్కర్‌ని బౌలింగ్ కోచ్‌గా నియమించాలని భావిస్తున్నాడు...
2023 వన్డే వరల్డ్ కప్ వరకూ అజిత్ అగార్కర్‌ని బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ, ఆల్‌రౌండర్లను తయారుచేసేందుకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నాడు...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి కామెంట్ చేశాడు...
పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా భారత్ ఏ, అండర్ 19 ఇండియా టీమ్‌లకు సేవలు అందించాడు. అయితే మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా నియమించిన తర్వాత సౌతాఫ్రికాలో భారత బౌలర్లు అనుకున్నంతగా రాణించలేకపోయారు...
పేరు చెప్పకపోయినా ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో నిర్ణయాలు తీసుకునేంత సీన్ ఉన్న సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఒక్కడే...