టీమిండియా కాదు, టీమ్ భారత్... వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ వాడాలంటూ వీరేంద్ర సెహ్వాగ్ పిలుపు...
భారతదేశానికి బ్రిటీషోడు పెట్టిన పేరు ఇండియా. స్వాతంత్ర్యం వచ్చి, 76 ఏళ్లు దాటుతున్నా మనదేశానికి ఇప్పటికీ భారతదేశం కంటే ఇండియా అనే పేరునే ఎక్కువగా వాడుకలో ఉంది. దీన్ని తొలగించాలని ఇండియాకి బదులుగా భారత్ వాడాలని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుంది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, టీమిండియా స్కార్డ్ అంటూ రాయడాన్ని వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఇకపై టీమిండియాగా కాకుండా, టీమ్ భారత్‌గా మన జట్టును పిలవాలంటూ పిలుపునిచ్చాడు వీరూ..
Virender Sehwag
‘1996 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్, ప్రపంచ కప్ ఆడేందుకు భారత్‌కి వచ్చింది. ఆ సమయంలో నెదర్లాండ్స్ పేరు హోలాండ్‌గా ఉంది. 2003లో నెదర్లాండ్స్‌గా ఆడింది. బర్మా కూడా బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరును తొలగించుకుని, మయన్మార్ పేరుతో చలామణీ అవుతోంది. చాలా దేశాలు ఒరిజినల్ పేర్లకు వచ్చేశాయి..
మనదేశానికి పేరే గర్వకారణం. మనం భారతీయులు. ఇండియా అనే పేరు బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. ఇప్పటికే చాలా ఏళ్లుగా ఇండియా అనే పేరు వాడుతున్నాం. ఇకనైనా అధికారికంగా భారత్ అనే పేరు తిరిగి తీసుకురావాలి. బీసీసీఐ, జై షాకి ఇదే విషయాన్ని విన్నవిస్తున్నా. ఇక టీమిండియాగా కాకుండా టీమ్ భారత్‌గా జట్టును పిలవాలి..
టీమిండియా నహీ, టీమ్ భారత్. ఈ వరల్డ్ కప్‌లో మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, జడ్డూ కోసం ఛీర్ చేద్దాం. భారతదేశాన్ని గుండెల్లో నింపుకుని, ప్లేయర్లు ‘ఇండియా’ అని కాకుండా ‘భారత్’ అని రాసి ఉన్న జెర్సీలను ధరించాలని కోరుకుంటున్నా..’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
ఈ ట్వీట్లపై ఓ నెటిజన్, మీరు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే గౌతమ్ గంభీర్ కంటే ముందే ఎంపీ అయ్యేవారు అంటూ కామెంట్ చేశాడు. దీనికి తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు వీరూ..
‘నాకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదు. గత రెండు ఎలక్షన్లలో రెండు మేజర్ పార్టీలు నా దగ్గరికి వచ్చాయి. నా ఉద్దేశంలో సినిమావాళ్లు కానీ క్రీడాకారులు కానీ రాజకీయాల్లోకి వెళ్లకూడదు...
ఎందుకంటే ఈ రెండు రంగాల్లో రాణించేవాళ్లు ఇగో వల్లనో లేక అధికార దాహం వల్లనో రాజకీయాల్లోకి వెళ్తారు. జనాలకు సేవ చేసేందుకు వారి దగ్గర సమయం ఉండదు. చాలా కొద్ది మంది మాత్రమే జనాలకు సమయాన్ని కేటాయిస్తారు. మిగిలిన వాళ్లంతా పీఆర్ టీమ్‌తోనే కథ నడిపిస్తారు..
నేను క్రికెట్‌లో ఉంటా, కామెంటేటర్‌గా ఉంటా. పార్ట్ టైం ఎంపీగా సమయం దొరికినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..