- Home
- Sports
- Cricket
- ఆఫ్ఘాన్ ఆ ఒక్క వికెట్ తీసి ఉంటే, ఈరోజు ఆసియా కప్ 2022 ఫైనల్‌లో టీమిండియా... పాక్‌పై లంక విజయంతో...
ఆఫ్ఘాన్ ఆ ఒక్క వికెట్ తీసి ఉంటే, ఈరోజు ఆసియా కప్ 2022 ఫైనల్‌లో టీమిండియా... పాక్‌పై లంక విజయంతో...
ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్‌లో పాకిస్తాన్, శ్రీలంక తలబడబోతున్నాయి. శ్రీలంక ఖాతాలో ఇప్పటికే ఐదు ఆసియా కప్ టైటిల్స్ ఉన్నాయి. భారత జట్టు తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అదే. అయితే ఈ మధ్య ఏ మాత్రం ఫామ్‌లో లేని లంక, అంచనాలు లేకుండా బరిలో దిగి ఫైనల్ చేరింది...

Wanindu Hasaranga
ఫైనల్ మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది శ్రీలంక. పాకిస్తాన్‌ని 19.1 ఓవర్లలో 121 పరుగులకి ఆలౌట్ చేసిన శ్రీలంక, ఆ లక్ష్యాన్ని 17 ఓవర్లలో ఛేదించింది...
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ వికెట్ ఒక్కటీ సరిగ్గా తీసి ఉంటే... ఈ మ్యాచ్ ఫలితం, టీమిండియాని ఫైనల్ చేర్చి ఉండేది. ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగింది...
Image credit: Getty
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ ఈ టార్గెట్‌ని ఈజీగా ఛేజ్ చేస్తుందని అనుకున్నారంతా. అయితే ఊహించని విధంగా అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఆఫ్ఘాన్ బౌలర్లు...
Afghanistan
దీంతో వరుస వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, 118 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. పాకిస్తాన్ విజయానికి అప్పటికి ఇంకా 13 పరుగులు కావాలి. ఆఫ్ఘాన్ బౌలర్లు ఒక్క బాల్ సరిగా వేసి వికెట్ తీసి ఉంటే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌కి సంచలన విజయం దక్కి ఉండేది...
Naseem Shah
ఫజల్‌హక్ ఫరూకీ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన నసీం షా, పాకిస్తాన్‌కి ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందించాడు. భారీ అంచనాలతో బరిలో దిగిన భారత్, ఆఫ్ఘాన్... సూపర్ 4 రౌండ్‌కే పరిమితమయ్యాయి.
ఆ మ్యాచ్‌లో ఫరూకీ కానీ, అంతకుముందు ఓవర్ వేసిన ఫరీద్ కానీ ఇంకొక్క వికెట్ తీసి ఉంటే... ఇప్పుడు ఆఫ్ఘాన్, పాకిస్తాన్, టీమిండియా ఒక్కో విజయంతో ఉండేవి. ఆఫ్ఘానిస్తాన్‌పై 101 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా... తాజాగా శ్రీలంక విజయంతో పాకిస్తాన్ కంటే మెరుగైన రన్‌రేటుతో ఫైనల్ చేరి ఉండేదని వాపోతున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్..
rohit sharma
లంకతో మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ నెట్ రన్ రేట్ మైనస్ 0.279గా ఉండగా భారత రన్‌రేట్ + 1.607గా ఉంది. అయితే భారత జట్టుకి లక్‌తో పాటు టాస్ కూడా కలిసి రాకపోవడంతో పాటు మనోళ్లు సరిగా ఆడక ఫైనల్ చేరలేకపోయారని సరిపెట్టుకుంటున్నారు కొందరు అభిమానులు...