54 నిమిషాల్లో ఏడు వికెట్లు, ఇలా అయితే చాలా కష్టం... సునీల్ గవాస్కర్ కామెంట్స్...
లార్డ్స్ టెస్టులో సమిష్టిగా ఆడి, ప్రత్యర్థిని చిత్తు చేసింది టీమిండియా. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లోనే సమిష్టిగా విఫలమై, ఘోరంగా ఓడింది... మూడో రోజే ముగుస్తుందని అంచనా వేసిన టెస్టు, నాలుగో రోజు దాకా వెళ్లినా... కీలకమైన సమయంలో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు...
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరుకి 139 పరుగుల దూరంలో ఉంది టీమిండియా. ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకుపోయారు...
ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 99 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదుచేయడంతో టీమిండియా అభిమానుల్లో ఆశలు చిగురించాయి... పూజారా, కోహ్లీ సెంచరీలు చేసుకుని, భారత జట్టును ఆదుకుంటారని ఆశించారు...
అయితే ఓవర్‌నైట్ స్కోరు 215/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... 278 పరుగులకి ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ 76 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది...
తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత టీమిండియా ఓడుతుందని ఊహించారు అందరూ, కానీ మూడో రోజు ఆట తర్వాత ఇన్నింగ్స్ తేడాతో ఓటమి మాత్రం ఉండదని భావించారు...
అయితే ఛతేశ్వర్ పూజారా వికెట్ పడిన తర్వాత వికెట్ల పతనానికి గేట్లు ఎత్తేసినట్టయ్యింది. అప్పటిదాకా క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీ నుంచి రహానే, పంత్, మహ్మద్ షమీ... ఇలా 63 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
‘లార్డ్స్‌లో టీమిండియా అద్వితీయ ఆటను చూపించింది. ఆ ఆటను చూసిన తర్వాత ఇంగ్లాండ్, ఈ సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమేనని అనుకున్నాను... అయితే మూడో టెస్టులో సీన్ రివర్స్ అయ్యింది...
మొదటి మూడు వికెట్లు పడితే చాలు, మిగిలిన వికెట్లు తీయడానికి పెద్ద సమయమేమీ పట్టదని అందరికీ అర్థమైపోయింది... 54 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు పడ్డాయి...
ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. బ్యాటింగ్‌కి సహకరిస్తున్న పిచ్‌పై ఇలా కుప్పకూలడం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ భారత క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...