- Home
- Sports
- Cricket
- ఒకే రోజు, ముగ్గురు లెజెండ్స్... సరిగ్గా ఇదే రోజున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ ఎంట్రీ...
ఒకే రోజు, ముగ్గురు లెజెండ్స్... సరిగ్గా ఇదే రోజున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ ఎంట్రీ...
టీమిండియా టెస్టు క్రికెట్‌కి జూన్ 20 చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు లెజెండ్స్ ఈ రోజునే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చారు. భారత జట్టుకి బ్యాటర్లుగా, కెప్టెన్లుగా అద్వితీయ విజయాలు అందించిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ... టెస్టు ఆరంగ్రేటం చేసింది ఈ రోజే...

1996, జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ. తొలి ఇన్నింగ్స్‌లో 301 బంతుల్లో 20 ఫోర్లతో 131 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ, లార్డ్స్‌లో ఆరంగ్రేటం చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 25 ఏళ్ల తర్వాత 2021లో కివీస్ బ్యాటర్ డివాన్ కాన్వే, గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు...
ఇదే మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్ 267 బంతుల్లో 6 ఫోర్లతో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకే రోజున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన గంగూలీ, ద్రావిడ్ ఇద్దరూ కూడా ఆ తర్వాత టీమిండియా కెప్టెన్లుగా రాణించారు...
రాహుల్ ద్రావిడ్ 164 టెస్టుల్లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13,288 పరుగులు చేయగా, వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచిన రాహుల్ ద్రావిడ్, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు...
టీమిండియాకి కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందించిన సౌరవ్ గంగూలీ, 113 టెస్టుల్లో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7212 పరుగులు చేశాడు. వన్డేల్లో 311 మ్యాచులాడి 11,363 పరుగులు చేసిన గంగూలీ, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు...
ఈ ఇద్దరి ఆరంగ్రేటం తర్వాత 15 ఏళ్లకు టెస్టు ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో అత్యధిక ద్విశతకాలు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 8043 పరుగులు సాధించాడు...
కెప్టెన్‌గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, టీమిండియాకి 40 టెస్టు విజయాలు అందించి అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్లలో టాప్ 4లో నిలిచాడు. గ్రేమ్ స్మిత్ 53, రికీ పాంటింగ్ 48, స్టీవ్ వా 41 టెస్టు విజయాలతో విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు..