బీసీసీఐ ఆదేశాలు బేఖాతరు.. బర్మింగ్ హోమ్ లో బరితెగించి తిరుగుతున్న టీమిండియా క్రికెటర్లు..
IND vs ENG: అసలే కీలక టెస్టు మ్యాచ్ ముందుంది. ఇప్పటికే కెప్టెన్ కరోనా బారిన పడి ఐసోలేషన్ లో గడుపుతున్నాడు. బీసీసీఐ కూడా బయటకు తిరగకండంటూ ఆదేశాలు జారీ చేసిన టీమిండియా ఆటగాళ్లకు మాత్రం కొంచెం కూడా సోయి లేకుండా పోయింది.
గతేడాది కరోనా నేర్పిన పాఠాల నుంచి టీమిండియా ఆటగాళ్లు ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. అసలే కరోనా కారణంగా గతేడాది చివరి టెస్టు అర్థాంతరంగా నిలిచిపోయి ఇరు జట్ల బోర్డులు తంటాలు పడుతూ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసి ఏడాది తర్వాత ఆడిస్తున్నా టీమిండియా క్రికెటర్లకు మాత్రం కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వారి వైఖరి చూస్తుంటే ‘దున్నపోతు మీద వర్షం పడ్డట్టు’గా ఉంది.
కీలక టెస్టుకు ముందే బర్మింగ్ హోమ్ లో షాపింగులకని తిరిగిన రోహిత్ శర్మ.. రెండ్రోజుల క్రితం కరోనా బారిన పడి ఐసోలేషన్ లో గడుపుతున్నాడు. అతడు జులై 1 న జరిగే టెస్టుకు అందుబాటులో ఉంటాడా..? లేదా..?అని బీసీసీఐ తలలు పట్టుకుంది. ఇకనైనా బయట తిరుగుళ్లు మానాలని సూచించింది.
కానీ ఈ ఆదేశాలను టీమిండియా క్రికెటర్లు అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. కోవిడ్ ముప్పు ఇంకా పొంచిఉందని జాగ్రత్తగా ఉండాలని.. బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని.. ఒకవేళ్ వెళ్తే కనీసం మాస్కులైనా పెట్టుకోవాలని సూచించినా మన క్రికెట్ వీరులెవరూ ఆ సూచనలను ఆ ఆదేశాలను అంత సీరియస్ తీసుకున్నట్టుగా లేరు.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, కమలేష్ నాగర్ కోటిలు కలిసి ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సరే తినేప్పుడు మాస్కు పెట్టుకోకపోయినా తర్వాత అందరూ కలిసి హోటల్ సిబ్బందితో ఫోజులిచ్చారు. అదీగాక అసలే ఇంగ్లాండ్ కు వెళ్లేముందు కరోనా బారిన పడి కోలుకున్న కోహ్లి కూడా బర్మింగ్ హోమ్ లో తనను కలిసి అభిమానులతో కలిసి ముఖానికి మాస్కు లేకుండానే ఫోటోలు దిగాడు.
వీరేగాక టీమిండియా యువ క్రికెటర్ కెఎస్ భరత్, రవీంద్ర జడేజా లు కూడా బర్మింగ్ హోమ్ వీధుల్లో షాపింగులకు తిరుగుతున్న ఫోటోను తమ ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు.
కాగా మన క్రికెటర్ల ఉత్సాహం చూస్తుంటే రాబోయే రెండు మూడు రోజుల్లో మరికొంతమంది ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక ఈసారి కూడా టెస్టు క్యాన్సిల్ అయితే ఆ బాధ్యత కచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆటగాళ్లదే కానుంది.