- Home
- Sports
- Cricket
- అతడంటే నాకు చాలా గౌరవం.. కానీ ఆ విషయంలో మాత్రం.. సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రావిడ్
అతడంటే నాకు చాలా గౌరవం.. కానీ ఆ విషయంలో మాత్రం.. సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రావిడ్
Rahul Dravid Responds on Wriddhiman Saha Comments: జట్టుకు ఎంపికవని ఆటగాళ్లు బాధకు లోనవడం సహజమే కానీ అయినంత మాత్రానా ఇలా వ్యవహరించడంపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనను రిటైర్ అవమన్నాడని చెప్పిన వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తనపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ద్రావిడ్ స్పందించాడు.
సాహాపై తనకు గౌరవమున్నదని, టీమిండియా విజయాల్లో భాగమైన అతడితో మిగతా ఆటగాళ్లతో మాట్లాడినట్టుగానే మాట్లాడాను తప్ప తనకు దురుద్దేశం ఏదీ లేదని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
సాహా వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపిన నేపథ్యంలో ద్రావిడ్ స్పందించాడు. ‘భారత క్రికెట్ విజయాల్లో తను (సాహా) భాగమయ్యాడు. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అందరు ఆటగాళ్లతో మాట్లాడినట్టుగానే సాహాతో కూడా మాట్లాడాను. అయితే ఈ విషయంలో సాహాకు కొంచెం క్లారిటీ అవసరం.
సాహా ఇలా స్పందిస్తాడని, మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలు వినాల్సి వస్తుందని నేను ఊహించలేదు. అయితే మనం చెప్పిన మాటలు, ఇచ్చిన సలహాలు ప్రతి ఆటగాడికీ నచ్చాలని లేదు కదా.
అందుకే సాహా కామెంట్లపై నేను పెద్దగా బాధపడటం లేదు. మన అభిప్రాయాలతో ఏకీభవించని కారణంగా ఇతర ఆటగాళ్లను తప్పుపట్టాల్సిన అవసరం కూడా ఏమీలేదని నా అభిప్రాయం...’ అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే రిషభ్ పంత్ అన్ని ఫార్మాట్లలో నిరూపించుకోవడంతో సాహా కు ఇక అవకాశాలు దక్కకపోవచ్చునని మాత్రమే తాను చెప్పానని, అంతకుమించి ఏమీ లేదని ద్రావిడ్ అన్నాడు. ‘పంత్ తనను తాను నెంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా నిరూపించుకున్నాడు.
అంతేగాక అతడికి సబ్ స్టిట్యూట్ గా మేము అప్ కమింగ్ వికెట్ కీపర్ కోన భరత్ ను మెరుగుదిద్దాలనుకుంటున్నాం. ఆ విషయాన్ని సాహాతో చెప్పడానికి నేను ప్రయత్నించాను. అయినంత మాత్రానా సాహా పై నాకు గౌరవం లేదని కాదు.
నా వరకైతే ఆటగాళ్లతో ఇలాంటి సంభాషణలు చేయకపోవడమే ఉత్తమం. కానీ కొన్నిసార్లు అది తప్పదు. ఇక్కడ కఠిన వాస్తవం ఏమిటంటే జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు వాస్తవాలు గ్రహించి వ్యవహరిస్తే మంచిది...’ అని ద్రావిడ్ తెలిపాడు.
ఇక జట్టు ఎంపిక విషయంలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో మాట్లాడతామని ద్రావిడ్ చెప్పాడు. ‘జట్టు ఎంపిక విషయంలో నేను గానీ రోహిత్ శర్మ గానీ ఆటగాళ్లతో మాట్లాడతాం. వాళ్లు ఎందుకు జట్టులో లేరో సరైన కారణాలు వివరిస్తాం. జట్టుకు ఎంపికవని ఆటగాళ్లు బాధకు లోనుకావడం సహజం. అలా అని సదరు ఆటగాళ్లపై నాకు గౌరవం తగ్గదు. నా జట్టు పూర్తి నిజాయితీ, స్పష్టత తో ఉండాలని నేను కోరుకుంటాను..’ అని ద్రావిడ్ వివరించాడు.