గెలిచింది ఒక్క టెస్టు మాత్రమే, టెస్టు సిరీస్ కాదు... ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే...
ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో వరుసగా రెండు టెస్టుల్లో భారత్ ఆధిపత్యం చూపించింది. లార్డ్స్ టెస్టులో చిరస్మరణీయ విజయం అందుకుని, కొండంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. అయితే టెస్టు సిరీస్ గెలవాలంటే కొన్ని తప్పులు సరిదిద్దుకోవాలని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ఇంతకముందు టెస్టుల్లో భారత ఓపెనర్లు, టెయిలెండర్లు ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చేవాళ్లు... కేవలం మిడిల్ ఆర్డర్‌లో వచ్చే పరుగుల కారణంగా టీమిండియాకి విజయాలు దక్కేవి... ఎన్నో ఏళ్ల నుంచి గత ఆస్ట్రేలియా టూర్ దాకా ఇదే పరిస్థితి...
అయితే ఇంగ్లాండ్ టూర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఈ రెండు విభాగాలు పటిష్టంగా తయారయ్యాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. కెఎల్ రాహుల్ రెండు టెస్టుల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిస్తే, రోహిత్ శర్మ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
రోహిత్ శర్మ చాలా టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్. వీరేంద్ర సెహ్వాగ్‌లా తన దూకుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు. అయితే అతను ఈజీగా ఇంగ్లాండ్ ట్రాప్‌లో ఇరుక్కుంటున్నాడు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు రోహిత్ తన వికెట్ తానే పారేసుకున్నాడు...
రోహిత్ శర్మకు పుల్ షాట్ ఆడడం అంటే చాలా ఇష్టం. అందుకే అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఊరించే బౌన్సర్లతో రెచ్చగొడుతోంది ఇంగ్లాండ్. రోహిత్ ఫుల్ షాట్ ఎక్కువగా కొట్టే ఏరియాలో ఓ మంచి ఫీల్డర్‌ను మోహరిస్తోంది...
ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫుల్ షాట్‌కి ప్రయత్నించి, అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. అయితే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇలా అవుటైన తర్వాత కూడా, ‘నేను మళ్లీ అదే షాట్ ఆడడానికి భయపడను’ అని చెప్పిన రోహిత్, రెండో టెస్టులోనూ అదే రీతిలో అవుట్ అయ్యాడు.
రోహిత్ శర్మ, తనకి ఇష్టమైన ఈ షాట్ ఆడడంలో తప్పులేదు. అయితే ఏ బంతిని బౌండరీ అవతల పడేయాలనే విషయంలో అతనికి చాలా క్లారిటీ అవసరం. లేదంటే విదేశాల్లో టెస్టు సెంచరీ చేయాలనే ఆశ నెరవేరడం కష్టమే...
ఇన్నాళ్లు భారత జట్టుకి బలంగా మారిన మిడిల్ ఆర్డర్, ఈ టూర్‌లో భారంగా మారింది... విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా (తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 12 పరుగులు తీసి వేస్తే), అజింకా రహానే కంటే... లోయర్ ఆర్డర్‌లో వచ్చే మహ్మద్ షమీ ఎక్కువ పరుగులు చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...
విరాట్ కోహ్లీ ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే రకంగా అవుట్ కావడం... అతని టెక్నిక్ లోపాన్ని చూపిస్తోంది. స్టంప్స్‌కి కాస్త దూరంగా వచ్చే గుడ్ లెంగ్త్ బంతులను వదిలిపెట్టాలా? ఆడాలా? అనే సందిగ్ధంతో వికెట్ సమర్పించుకుంటున్నాడు విరాట్ కోహ్లీ...
Virat Kohli
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 102 బంతులు ఆడిన తర్వాత కూడా ఇలాంటి బంతి వల్లే, ఎడ్జ్ ఇచ్చి అవుట్ కావడం కోహ్లీ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, సెంచరీల మోత మోగించాలంటే ఈ టెక్నిక్‌ను సరి చేసుకోవాల్సిందే...
అలాగే ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కూడా అంతే... వీళ్లిద్దరూ అవుటైన బంతులు కూడా మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకేలా ఉన్నాయి. పూజారా 200 బంతులను ఎదుర్కొన్న తర్వాత షార్ట్ లెంగ్త్ బంతికి అవుట్ అవ్వడం... రెండేళ్లుగా కొనసాగుతూ వస్తోంది... దీన్ని అతను సరిచేసుకోకపోతే మరింత ఇబ్బంది పడడం ఖాయం...
వికెట్ కీపర్ రిషబ్ పంత్ తనదైన స్టైల్‌లో దూకుడుగా ఆడుతున్న ఇప్పటిదాకా ఈ సిరీస్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. రిషబ్ పంత్ ఫామ్‌లోనే ఉన్నాడు, పరుగులు సాధిస్తున్నాడు, అయితే జట్టు విజయానికి అవి సరిపోవు.
లక్కీగా బుమ్రా, షమీ అదరగొట్టడంతో లార్డ్స్ టెస్టులో టీమిండియా... భారీ ఆధిక్యం అందుకుని, ప్రత్యర్థిపై పైచేయి సాధించింది కానీ... రిషబ్ పంత్ అవుటైన తర్వాత ఈ ఇద్దరూ కూడా త్వరగా పెవిలియన్ చేరి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండి ఉండేది...
రెండు టెస్టుల్లోనూ భారత ఫాస్ట్ బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. జస్ప్రిత్ బుమ్రా, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయకపోయినా... రెండో ఇన్నింగ్స్‌లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కానీ ఏకంగా 15 నో బాల్స్ వేశాడు. ఇందుతో 13 నో బాల్స్ మొదటి ఇన్నింగ్స్‌లోనే వచ్చాయి.
అలాగే భారత స్పిన్ విభాగంలో మిగిలిన జడేజా మాత్రం గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీయలేకపోయాడు... ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని కాదని రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు ఇచ్చింది టీమిండియా. జడేజా రెండో ఇన్నింగ్స్‌లో మొయిన్ ఆలీ వికెట్ తీసినా, అది నో బాల్ కావడంతో ఫలితం దక్కలేదు... టెస్టులో ఓ స్పిన్నర్ నో బాల్ వేయడం అతని అలసత్వానికి నిదర్శనం..
రవీంద్ర జడేజా బ్యాటుతో రాణిస్తున్నా, బాల్‌తో మాత్రం ఎటువంటి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. జడ్డూ స్థానంలో అశ్విన్ ఉండి ఉంటే, జో రూట్ ఈ రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చేవాడు కాదనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా...