- Home
- Sports
- Cricket
- TATA IPL: ఎక్స్ట్రాలు ఇస్తే అంతే మరి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదుచేసిన ఆర్సీబీ..
TATA IPL: ఎక్స్ట్రాలు ఇస్తే అంతే మరి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదుచేసిన ఆర్సీబీ..
TATA IPL 2022: ఆదివారం పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో ఆర్సీబీ 200 ప్లస్ స్కోరు చేసినా ఓడిన సంగతి తెలిసిందే.

కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ ఈ సీజన్ ఘనంగా ఆరంభించాలని అనుకుంది. అయితే ఆ మేరకు తొలుత బ్యాటింగ్ చేసి మెరుపులు మెరిపించింది.
డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లి (41 నాటౌట్), దినేశ్ కార్తీక్ (32 నాటౌట్) లు రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ ముందు 206 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ ఏం తక్కువ తిన్లేదు. ఓ ప్రణాళిక ప్రకారం ఆడిన పంజాబ్.. మరో 6 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే పంజాబ్ విజయంలో ఆర్సీబీ బౌలర్లు ఇచ్చిన పరుగులతో పాటు ఆ జట్టు చేసిన కీలక తప్పిదం కూడా కారణమైంది.
ఈ మ్యాచులో ఆర్సీబీ ఏకంగా 39 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో పంజాబ్ కు సమర్పించుకుంది. వైడ్ లు, లెగ్ బైలు, ఓవర్ త్రో ల రూపంలో 39 పరుగులు వచ్చాయి. పంజాబ్ విజయానికి ఇవి కూడా కారణమయ్యాయి.
కాగా, నిన్నటి మ్యాచులో ఓటమితో పాటు ఓ చెత్త రికార్డును కూడా ఆర్సీబీ మూట గట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఎక్స్ట్రా లు ఇచ్చిన జట్టుగా బెంగళూరు నిలిచింది. గతంలో ఈ రికార్డు.. డెక్కన్ ఛార్జర్స్ పేరిట ఉండేది.
2008లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో డెక్కన్ ఛార్జర్స్.. 38 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో సమర్పించుకుంది. ఇక ఈ జాబితాలో తర్వాత పంజాబ్ కింగ్స్ కూడా నిలిచింది. 2010 సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓ మ్యాచులో పంజాబ్ కూడా 38 పరుగులు అదనంగా ఇచ్చుకుంది.
ఇప్పుడు ఆర్సీబీ ఈ రెండు జట్ల రికార్డులను బద్దలుకొట్టి అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగులలో 39 పరుగులు అదనంగా రాగా.. ఇక పంజాబ్ చేసింది 167 పరుగులే..