- Home
- Sports
- Cricket
- IPL2022: ఓపెనింగ్ కాదు.. ఫినిషర్ గా వస్తే ఇంకా బెటర్.. లక్నో కెప్టెన్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL2022: ఓపెనింగ్ కాదు.. ఫినిషర్ గా వస్తే ఇంకా బెటర్.. లక్నో కెప్టెన్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL2022: ఓపెనింగ్ నుంచి మొదలుకొని ఏడో స్థానం వరకు ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్.

భారత జట్టులో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ స్థానాలను మార్చుకుంటున్న కెఎల్ రాహుల్..ఐపీఎల్ లో మాత్రం ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. గతంలో పంజాబ్ తరఫున ఆడినా.. ఇప్పుడు లక్నోకు ఆడుతున్నా రాహుల్ ఓపెనర్ గానే వస్తున్నాడు.
అయితే కెఎల్ ఓపెనర్ గా కంటే ఫినిషర్ గా భాగా రాణించగలడని అంటున్నాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. డెత్ ఓవర్లలో అతడు అవలీలగా షాట్లు ఆడగలడని కొనియాడాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో గవాస్కర్ మాట్లాడుతూ... ‘కెఎల్ రాహుల్ అద్భుత ఆటగాడు. అతడు ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయడమే గాక 20 ఓవర్ల (టీ20లలో) పాటు వికెట్ ను కాపాడుకోగల సమర్థుడు. అతడు ఓపెనర్ గా మెరుస్తున్నా ఫినిషర్ గా కూడా అంతకంటే భాగా రాణించగలడని నేను అభిప్రాయపడుతున్నాను.
ఎందుకంటే అతడు ఇన్నింగ్స్ ను ప్రారంభించి.. త్వరగా షాట్లు ఆడి స్కోరును పెంచే రకం కాదు. అతడి క్రికెట్ పుస్తకంలో అన్ని షాట్లున్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాహుల్ బాగా రాణిస్తాడు.
ఒకవేళ రాహుల్ గనక 15-16 ఓవర్లో బ్యాటింగ్ కు వస్తే అతడు ఇన్నింగ్స్ ను గొప్పగా ముగిస్తాడు. అదే స్థానంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తే లక్నో జట్టు స్కోరు 200 ప్లస్ ఉంటుందే తప్ప తక్కువగా ఉండదని నా నమ్మకం...’అని సన్నీ అన్నాడు.
కాగా.. గత సీజన్ లో పంజాబ్ తరఫున ఆడుతూ ఓపెనర్ గా వచ్చిన రాహుల్.. లక్నో తరఫున కూడా క్వింటన్ డికాక్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు.
ఈ సీజన్ తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ తో ఆడిన మ్యాచులో ఓపెనర్ గా వచ్చి డకౌటైన రాహుల్.. చెన్నై సూపర్ కింగ్స్ తో మాత్రం చెలరేగి ఆడాడు. సీఎస్కేతో మ్యాచులో డికాక్ తో కలిసి దూకుడుగా ఆడాడు.