- Home
- Sports
- Cricket
- T20 World Cup: ఈ బయో బబుల్స్ నా వల్ల కాదు.. నేనెళ్లిపోతా.. సూపర్-12 కు ముందు శ్రీలంకకు షాకిచ్చిన జయవర్ధనే
T20 World Cup: ఈ బయో బబుల్స్ నా వల్ల కాదు.. నేనెళ్లిపోతా.. సూపర్-12 కు ముందు శ్రీలంకకు షాకిచ్చిన జయవర్ధనే
Mahela Jayawardene:గ్రూప్ దశలో రెండు విజయాలతో అదరగొట్టిన శ్రీలంక సూపర్-12 కు అర్హత సాధించిన ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఆ జట్టు టీమ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్ధనే.. టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు.

టీ20 ప్రపంచకప్ (T20 world cup) లో సూపర్-12 (Super-12 stage) కు చేరిన శ్రీలంక (srilanka) జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఆ జట్టు టీమ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్ధనే (Mahela Jayawardene).. టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు.
గ్రూప్ దశలో రెండు విజయాలతో అదరగొట్టిన శ్రీలంక సూపర్-12 కు అర్హత సాధించిన ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. శ్రీలంక జట్టుకు కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్న ఆ జట్టు మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే.. అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
సూపర్-12 కు ముందు తాను జట్టును వీడుతున్నట్టు జయవర్ధనే తెలిపాడు. ఏమైనా పనుంటే తాను ఇంటిదగ్గర నుంచి చేస్తాను గానీ ఇక్కడ మాత్రం ఉండలేనని నిష్ర్కమించాడు.
సుమారు ఐదు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్న జయవర్ధనే.. ఇక బయోబబుల్ లో ఉండటం తన వల్ల కాదని తేల్చి చెప్పేశాడు. వీటి కారణంగా 135 రోజులుగా తన కూతురును చూడలేదని వాపోయాడు.
ఇదే విషయమై జయవర్ధనే స్పందిస్తూ... ‘ఇది (బయో బబుల్) చాలా కఠినం. జూన్ నుంచి ఇప్పటిదాకా క్వారంటైన్, బయో బబుల్స్ లోనే ఉన్నాను. నేను చాలా రోజులుగా నా కూతురును చూడలేదు. ఆ బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. నేను కచ్చితంగా ఇంటికి వెళ్లాలి’ అని తెలిపాడు.
అయితే బయో బబుల్ నుంచి వెళ్లిపోయినా తాను ఇంటి నుంచి సేవలందిస్తానని జయవర్దనే అన్నాడు. సాంకేతికంగా గానీ, మరేదైనా జట్టు అవసరాల నిమిత్తమైనా తనను సంప్రదించవచ్చునని స్పష్టం చేశాడు.
ఐసీసీ టీ20 టోర్నీకి ముందు జయవర్ధనే.. ఇంగ్లండ్ లోని సౌతర్న్ బ్రేవ్స్ కు కోచ్ గా సేవలందించాడు. దాని తర్వాత యూఏఈకి వచ్చాడు. అక్కడ ముంబై ఇండియన్స్ కోసం పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ కోసం శ్రీలంక జట్టుతో కలిశాడు.
కరోనా కారణంగా జయవర్ధనే.. ఏ జట్టుకు కోచ్ గా లేదా సహాయకుడిగా వెళ్లినా అక్కడ క్వారంటైన్,బయో బబుల్ లో ఉండాల్సి వస్తున్నది. దీంతో విసిగిపోయిన అతడు.. ఇక తాను ఎంతమాత్రం ఆ నిర్భంధంలో ఉండలేనని బయటకు వచ్చేశాడు.
జయవర్ధనే మాదిరే కొద్దిరోజుల క్రితం వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా ఐపీఎల్ రెండో దశ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన గేల్.. బయో బబుల్ లో ఉండలేనని బయటకు వచ్చేశాడు. ఇప్పుడతడు టీ20 ప్రపంచకప్ కోసం మళ్లీ వెస్టిండీస్ బయో బబుల్ లో చేరాడు.